కేసీఆర్ను మోదీ దేశ్ కీ నేతగా భావిస్తున్నారా…?
బీజేపీ – బీఆర్ఎస్ మధ్య అంతర్గతంగా ఎలాంటి సంబంధాలున్నాయో తెలీవు కానీ పైకి మాత్రం ఆ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు పరస్పరం మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. కేసీఆర్ ను ఎలాగైనా గద్దె దించుతామని బీజేపీ నేతలు గట్టిగా చెప్తున్నారు. తాజాగా తెలంగాణలో పర్యటించిన మోదీ కూడా కేసీఆర్ టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేశారు. దీంతో వార్ మరో రేంజ్ కు వెళ్లినట్టయింది. అయితే గతానికి భిన్నంగా మోదీ స్పీచ్ సాగడం కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కేసీఆర్ పేరు మోదీ నోటి వెంట రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరపడుతున్నాయి.
ప్రధాని మోదీ సాధారణంగా ఎవరిపైనైనా విమర్శలు చేసేటప్పుడు పేర్లు పెట్టి పిలవరు. విపక్షాలు, దొంగల ముఠాలు.. ఇలా సంబోధిస్తూ ఉంటారు. కాంగ్రెస్ కానీ ఇతర విపక్ష నేతలను కానీ ఆయన నేరుగా పేరు పెట్టి విమర్శించడం చాలా అరుదు. ఆయన పూర్తిగా సబ్జెక్టుకు మాత్రమే పరిమితమవుతుంటారు. వ్యక్తిగతంగా విమర్శలు చేయరు. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా స్పష్టంగా అర్థమయ్యేలా చెప్తుంటారు. కానీ ఈసారి మాత్రం గతానికి భిన్నంగా మోదీ స్వయంగా కేసీఆర్ పేరు పెట్టి విమర్శలు గుప్పించారు. 12 రోజుల వ్యవధిలో మోదీ ఇలా కేసీఆర్ పేరు పలకడం రెండోసారి. గతవారం మధ్యప్రదేశ్ లో పర్యటించినప్పుడు కేసీఆర్ కుమార్తె బాగుపడాలంటే బీఆర్ఎస్ కు ఓటేయాలన్నారు. వద్దనుకుంటే బీజేపీకి వేయాలన్నారు. ఇప్పుడు హన్మకొండలో కేసీఆర్ సర్కార్ అవినీతమయమని, ఆయన అవినీతి ఢిల్లీ వరకూ విస్తరించిందని విమర్శించారు.
గతంలో మోదీ తెలంగాణలో పర్యటించినప్పుడు ఎప్పుడూ కేసీఆర్ పేరు ఎత్తలేదు. మోదీకి స్వాగతం పలికేందుకు కేసీఆర్ కొన్నాళ్ల నుంచి వెళ్లట్లేదు. రెండు పార్టీల మధ్య గ్యాప్ బాగా పెరిగింది. మోదీని కూడా కేసీఆర్ కలవడం మానేశారు. అయినా మోదీ కూడా పట్టించుకోలేదు. తెలంగాణలో పర్యటించినప్పుడు కేసీఆర్ పేరు ఎత్తకుండానే ఇక్కడి సర్కార్ పైన విమర్శలు చేసి వెళ్లిపోయేవారు. కానీ ఈసారి కేసీఅర్ ను నేరుగా టార్గెట్ చేయడం వెనుక ఇతర కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల రాష్ట్రంలో బీజేపీ బలహీనపడిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ను ఎదుర్కొనే సత్తా బీజేపీకి లేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. వాటికి చెక్ పెట్టేందుకే మోదీ నేరుగా కేసీఆర్ ను టార్గెట్ చేశారని భావిస్తున్నారు. నువ్వో నేనో తేల్చుకుందాం అనేలా ఆయన మాట్లాడారు.
అయితే కేసీఆర్ పేరును మోదీ పదేపదే ప్రస్తావించడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరపడుతున్నాయి. కేసీఆర్ అంటే మోదీకి వణుకు మొదలైందని.. అందుకే ఆయన నామం జపిస్తున్నారని చెప్పుకుంటున్నారు. తెలంగాణ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఢిల్లీ వెళ్లి మోదీని గద్దె దించేవరకూ పోరాడతారని.. ఆ భయంతోనే మోదీ వణికిపోతున్నారని గులాబి నేతలు చెప్తున్నారు. మొత్తానికి తమ నేతను దేశ్ కీ నేతగా మోదీ అంగీకరించారని సంబరాలు చేసుకుంటున్నారు. మోదీకి సరైన మొగుడు కేసీఆర్ మాత్రమేనని బీరాలు పోతున్నారు.













