జనసేనకు షాక్.. గాజు గ్లాసు పోయె..!
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీతో కలసి పనిచేస్తోంది జనసేన పార్టీ. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలతో పాటు తాజాగా జరిగిన తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ ఉపఎన్నికలో కూడా ఆ పార్టీలు ఉమ్మడిగా పనిచేశాయి. ఏపీలో ఆ రెండు పార్టీల మధ్య సమన్వయం బాగానే ఉంది. దీంతో అక్కడ ఆ పార్టీలకు ఎలాంటి సమస్యా లేదు. అయితే తెలంగాణలో మాత్రం బీజేపీ, జనసేన మధ్య గ్యాప్ చాలా ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకోసం పోటీ నుంచి తప్పుకున్న జనసేన.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా హ్యాండ్ ఇచ్చింది. ఆ రెండు పార్టీల మధ్య ఇది సమస్యగా మారింది.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన కూడా బరిలోకి దిగాలని భావించింది. హైదరాబాద్ నగరంలోని ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు కూడా జనసేన పోటీ చేయాలని కోరారు. దీంతో పవన్ కల్యాణ్ కూడా పట్టున్న స్థానాల్లో పోటీ చేయాలని ఆదేశించారు. కొన్ని కార్పొరేట్ స్థానాలకు అభ్యర్థులు కూడా ఖరారయ్యారు. అయితే కిషన్ రెడ్డి లాంటి నేతలు పవన్ కల్యాణ్ ను కలిసి బీజేపీకి మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అయితే బండి సంజయ్ లాంటి నేతలు మాత్రం పవన్ కల్యాణ్ ను పట్టించుకోలేదు. అయినా కిషన్ రెడ్డి కోరడంతో పవన్ కల్యాణ్ అంగీకరించి.. బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటన విడుదల చేశారు. బీజేపీకి జనసేన మద్దతు ప్రకటించిన తర్వాత కూడా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జనసేన కార్యకర్తలను కానీ, పార్టీ నేతలను కానీ ఖాతరు చేయలేదు. దీంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర అసహనానికి గురయ్యాయి.
జీహెచ్ఎంసీలో జరిగిన అవమానాన్ని గుర్తుంచుకున్న పవన్ కల్యాణ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి షాక్ ఇచ్చారు. అనూహ్యంగా టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయి టీఆర్ఎస్ గెలిచింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ నేతలు తమను అవమానించారని.. అందుకే టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. అంతేకాక.. భవిష్యత్ ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. ఇక్కడ పోటీ చేయాలని జనసేన సంకల్పించింది. అయితే ఆ పార్టీకి అనుకోని దెబ్బ తగిలింది.
రెండు కార్పొరేషన్లకు జరిగే ఎన్నికల్లో జనసేన పార్టీ తన సింబల్ గాజు గ్లాసును కోల్పోయింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కనీసం 10శాతం స్థానాలకు పోటీ చేయకపోవడం వల్లే ఆ పార్టీ సింబల్ కోల్పోయినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. తమకు గాజు గ్లాసు సింబల్ కేటాయించని జనసేన విజ్ఞప్తి చేసినా.. ఎన్నికల సంఘం సరైన కారణాలు లేవంటూ తిరస్కరించింది. దీంతో జనసేనకు గాజుగ్లాసు మిస్ అయింది. మరి జనసేన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.













