స్నేహమంటే ఎలా పవన్..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం బీజేపీ-జనసేన కూటమి పోటీ చేస్తున్నాయి. దీనిలో భాగంగా అభ్యర్థుల తరపున జనసేనాని పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం లో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో తాను బీఆర్ ఎస్‌ను, కాంగ్రెస్‌ను తిట్టలేనని చెప్పారు. బీఆర్ ఎస్‌ను తిట్టాలని, కాంగ్రెస్ నేత లను తిట్టాలని కొందరు కోరుతున్నారని తెలిపారు.
అయితే.. తనకు బీఆర్ ఎస్‌లోనూ.. కాంగ్రెస్‌లోనూ.. మిత్రులు ఉన్నారని పవన్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ తనకు మిత్రుడని, రేవంత్ రెడ్డితోనూ స్నేహం ఉందని పవన్ వ్యాఖ్యానించారు. అయితే.. స్నేహం-రాజకీయం వేర్వేరే అయినా.. రాష్ట్ర మంతా తిరిగి పరిస్థితులు చూడలేదు కాబట్టి తాను బీఆర్ ఎస్‌ను తిట్టలేనని చెప్పారు. అయితే, తెలంగాణలోనూ ఏపీ మాదిరిగానే రాజకీయాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. గత పాలకులు చేసిన తప్పే పునరావృతం అవుతోందని అన్నారు.
పవన్ ప్రకటనతో బీజేపీ నేతలకు పాలుపోవడం లేదు. ఎందుకంటే పవన్ అధికార, విపక్ష పార్టీలపై విమర్శలు చేసేందుకు సముఖంగా లేరు. అధికార బీఆర్ఎస్ పై విమర్శలు చేయను.. విపక్ష కాంగ్రెస్ ను తిట్టను అంటే ఇంక అది ప్రచారమెలా అవుతుంది. అంటే ఓన్లీ మా కూటమి అభ్యర్థులను గెలిపించండి అంటే.. ఇక అందులో కిక్కేముంది. దీంతో పవన్ అంత సాఫ్ట్ గా ఉంటే ఎలా అని బీజేపీ, జనసేన అభ్యర్థులు తెగ ఇదై పోతున్నారు. అసలు పవన్ స్పీచ్ అంటేనే .. మాంచి విమర్శలు, సవాళ్లను కార్యకర్తలు, అభిమానులు ఆశిస్తారు. అదే లేకుంటే పొలిటికల్ బొమ్మ ఎలా హిట్టవుతుంది..?
పవన్ వదిలిన స్టేట్ మెంట్ ను బీఆర్ఎస్, కాంగ్రెస్ లు అట్టే వాడేసుకుంటాయి. ఇంక బీజేపీకి ఒరిగేదేముంటుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంటే స్నేహపూర్వక పోటీగా పవన్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది ఇలాగే సాగితే.. ఇక బీజేపీకి తగిన ఓట్లు దక్కే పరిస్థితి ఉండదు. పవన్ పార్టీకి కూడా ఇబ్బందులు తప్పని పరిస్థితి ఏర్పడుంది. ఇక్కడ సరైన స్థాయిలో ఓట్లు, సీట్లు రాకుంటే.. ఇక ఏపీలో పవన్ ను వైసీపీ ఓ ఆట ఆడేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.













