మా నాన్న ఆశయాలకు కట్టుబడి ఉన్నా : నోముల భగత్
నాగార్జున సాగర్ నియోజక అభివృద్ధికి తన తండ్రిలాగే తాను కట్టుబడి ఉంటానని నాగార్జున సాగర్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ ప్రకటించారు. తన తండ్రి నోముల నర్సింహ్మయ్య చేస్తానన్న కృషిని సీఎం కేసీఆర్ ఆశీస్సులతో కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా హాలియాలో జరిగిన సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నోముల భగత్ ప్రసంగించారు. ఈ నెల 17 న జరిగే నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో కారు గుర్తుకు ఓటు వేసి తనని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం అసెంబ్లీ బయట, లోపల తన తండ్రి ఎలా పాటుపడ్డారో అందరికీ తెలుసని గుర్తు చేశారు. 35 ఏళ్లలో జరగని అభివృద్ధిని సీఎం కేసీఆర్ సహాయంతో చేసి చూపిస్తానని భగత్ తెలిపారు. తండ్రి అకాల మరణంతో అనివార్యంగా వచ్చిన ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్ తనను ఆశీర్వదించి బరిలోకి దింపారని, తన తండ్రి ఆశయాలను, హామీలను నెరవేరుస్తానని నోముల భగత్ ప్రకటించారు.













