మైనంపల్లి విషయంలో కేసీఆర్ వెనక్కు తగ్గుతున్నారా…?
తెలంగాణలో ఇప్పుడు టాక్ ఆఫ్ ది పర్సన్ మైనంపల్లి హనుమంతరావు. మల్కాజిగిరి ఎమ్మెల్యేగా ఉన్న హనుమంతరావుకు మరోసారి పోటీ చేసే అవకాశం కల్పించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అయితే తన కుమారుడికి టికెట్ ఇవ్వకపోవడంపై మైనంపల్లి ఫుల్ ఫైర్ లో ఉన్నారు. ఈ ఊపులోనే ఆయన హరీశ్ రావుపై చేసిన కామెంట్స్ బీఆర్ఎస్ హైకమాండ్ ఆగ్రహానికి కారణమయ్యాయి. మైనంపల్లిపై వేటు వేసేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే తాడోపేడే తేల్చుకునేందుకు మైనంపల్లి కూడా రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో మైనంపల్లిపై ఆచితూచి వ్యవహరించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తాజా సమాచారం.
మైనంపల్లి హనుమంతరావు టీడీపీలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం బీఆర్ఎస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు దాదాపు సిట్టింగులందరికీ కేసీఆర్ మరోసారి అవకాశం కల్పించారు. అందులో భాగంగా మైనంపల్లికి కూడా టికెట్ దక్కింది. అయితే తనకు టికెట్ వచ్చినందుకు మైనంపల్లి సరిపెట్టుకోలేదు. తన కుమారుడు మైనంపల్లి రోహిత్ కు మెదక్ సీటు కావాలని పట్టుబడుతున్నారు. చాలా కాలం నుంచి మెదక్ లో మైనంపల్లి రోహిత్ యాక్టివ్ గా ఉంటున్నారు. కచ్చితంగా ఈ సీటు తమకు దక్కుతుందనే నమ్మకంతో ఉన్నారు మైనంపల్లి రోహిత్. అయితే చివరి నిమిషంలో కేసీఆర్ హ్యాండ్ ఇవ్వడంతో మైనంపల్లి రివర్స్ అయ్యారు.
మంత్రి హరీశ్ రావుపై మైనంపల్లి హనుమంతరావు బహిరంగంగానే కామెంట్స్ చేశారు. తనను ఇబ్బంది పెడితే తాను కూడా ఇబ్బంది పెడతానని ఓపెన్ గానే చెప్పేశారు. ఆ తర్వాత కూడా మైనంపల్లి శాంతించలేదు. కేసీఆర్, కేటీఆర్, రేవంత్ రెడ్డి.. ఇలాం అందరిపైనా ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఆ ఆడియో ఇప్పుడు హల్ చల్ సృష్టిస్తోంది. అంతేకాక.. తనపై వేటు వేస్తే ఏం చేయాలనే దానిపై మైనంపల్లి అనుచరులతో చర్చలు జరిపారు. వారం రోజులు వేచి చూడాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని అనుచరులకు వెల్లడించారు.
అయితే మైనంపల్లి శాంతించడం వెనుక కేసీఆర్ ఉన్నారని తాజాగా అందుతున్న సమాచారం. మైనంపల్లి హనుమంతరావు తన అనుచరులతో సమావేశం అయిన సమయంలోనే కేసీఆర్ తరపున ఒకరు ఫోన్ చేశారు. మల్కాజిగిరి నుంచి మైనంపల్లి పోటీ చేయాలని.. కుమారుడు రోహిత్ కు ఎమ్మెల్సీ ఇచ్చేందుకు కేసీఆర్ అంగీకరించారని తెలియజేశారు. అయితే ఈ విషయం కేసీఆర్ బహిరంగంగా చెప్పాలని మైనంపల్లి షరతు విధించారు. ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఆయన చెప్పారు. అందుకే వారం రోజుల పాటు గ్యాప్ తీసుకోవాలని మైనంపల్లి నిర్ణయించారు. ఈ లోపు కేసీఆర్ బహిరంగ ప్రకటన చేస్తే మైనంపల్లి బీఆర్ఎస్ లోనే కంటిన్యూ అవుతారు. లేకుంటే తన దారి తాను చూసుకుంటారు. ఇదీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ సస్పెన్స్ కు తెర పడాలంటే వారం రోజులు ఆగాల్సిందే.!













