కిషన్ రెడ్డికి ఘన స్వాగతం
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి హైదరాబాద్ చేరుకున్న జి.కిషన్‌రెడ్డికి బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఆయన ప్రత్యేక విమానంలో విమానాశ్రయానికి చేరుకున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు, ఆయా నియోజకవర్గాల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో విమానాశ్రయం వద్ద బారులుదీరారు. ఊరేగింపులు, ప్రదర్శనలతో స్వాగతం పలికేందుకు పోటీ పడ్డారు. ఆయన రాగానే కార్యకర్తలు నినాదాలు చేస్తూ, పార్టీ జెండాలను ప్రదర్శిస్తూ స్వాగతం పలికారు. ప్రత్యేకంగా అలకరించిన వాహనంపై కార్యకర్తలకు అభివాదం చేస్తూ కిషన్‌రెడ్డి ముందుకు కదిలారు. బేగంపేట నుంచి ఎంజీరోడ్డు, కవాడిగూడ, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, నారాయణగూడ, హిమాయత్‌నగర్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, హైదర్‌గూడ, బషీర్‌బాగ్, అబిడ్స్ మీదుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. మార్గమధ్యలో ఏర్పాటు చేసిన దాదాపు 50 స్వాగత వేదికల వద్ద డివిజన్ల వారీగా నాయకులు ఆయనకు స్వాగతం పలికి సత్కరించారు.













