‘లీడర్’ సీతక్క..
తెలంగాణలో వరదలు బీభత్సం సృష్టించాయి. చెరువులు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో మారుమూల గ్రామాల ప్రజలు జల దిగ్భందంలో చిక్కుకుని విలవిలలాడుతున్నారు. చాలా మంది నేతలు పర్యటించి, వారికి ధైర్యం చెబుతున్నారు. నేతలు వస్తున్నారు, వెళ్తున్నారు.. అయితే ఇలాంటి తరుణంలో ఎమ్మెల్యే సీతక్క మాత్రం మరోసారి తన సేవాగుణాన్ని చాటుకున్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలు …ములుగు జిల్లాలో విధ్వంసం సృష్టించాయి. చెరువులు పొంగిపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. ఇక ఇళ్లల్లోకి నీళ్లు చేరుకోవడంతో అనేకమంది ప్రజలు నిరాశ్రయులుగా మారారు. వీరిని ఆదుకునేందుకు సీతక్క ముందుకొచ్చారువరద బాధితులకు రూ.20 లక్షల విలువైన నిత్యావసర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేసి సీతక్క మరోసారి గొప్ప మనస్సును సీతక్క చాటుకున్నారు. ఏ ఎమ్మెల్యే చేయనటువంటి విధంగా సాయం చేసి గ్రేట్ అనిపించుకున్నారు.
ఇటీవల కురిసిన అతి భారీ వర్షాల ప్రభావానికి కొండయి గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వరద ఉధృతితో గ్రామంలోని వాగు పొంగిపొర్లడం, వంతెన కూలిపోవడంతో గ్రామస్తులు వేరే ప్రాంతానికి వెళ్లడానికి వీల్లేకుండా పోయింది. ఈ విషయం తెలసుకున్న సీతక్క.. కొండయి గ్రామ వరద బాధితులకు సాయం అందించారు. రహదారి సౌకర్యం లేకుండా పోవడంతో మూడు గంటలకుపైగా శ్రమించి తన బృందం, RDT టీమ్‌తో కలిసి పడవ ద్వారా గ్రామానికి చేరుకున్నారు. పడవలోనే పెద్ద బస్తాలలో సరుకులు ఉంచి గ్రామానికి తరలించారు. అనంతనం వాటిని గ్రామస్తులకు పంపిణీ చేశారు. సరుకులు పంపిణీ చేయడంతో సీతక్కకు వరద బాధితులు ధన్యవాదాలు తెలిపారు. ఇంత కష్ట సమయంలో సీతక్క సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని అంటున్నారు.
భారీ వర్షంలోనూ వరద బాధితులను పరామర్శిస్తూ సీతక్క ధైర్యం చెబుతున్నారు. ప్రభుత్వం తరపు నుంచే కాకుండా తన వంతు కూడా సహాయం అందిస్తున్నారు. గతంలో కరోనా సమయంలోనూ సీతక్క.. కొండప్రాంతాలు, ఏజెన్సీల్లో పర్యటించి.. వారందరికీ సాయమందించింది. అప్పుడు కూడా సీతక్క సాయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో సీతక్కకు పార్టీలతో సంబంధం లేకుండా అభిమానులు ఏర్పడ్డారు. సాహో సీతక్క అంటూ తమ అభిమానం చాటుకుంటున్నారు.













