బండి ఔట్.. ఈటలకు పగ్గాలు..? త్వరలో తెలంగాణ బీజేపీ సమూల ప్రక్షాళన..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీలూ సమాయత్తమవుతున్నాయి. ఈసారి బీఆర్ఎస్ ను ఓడించాలని బీజేపీ గట్టి పట్టుదలగా ఉంది. అందుకోసం తమ ముందున్న అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన అస్త్రాలను బయటకు తీస్తోంది. అంతర్గత విభేదాలను పరిష్కరించడం, బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడం, ముఖ్యమైన నేతలను పార్టీలోకి ఆహ్వానించడం.. లాంటి అనేక వ్యూహాలతో బీజేపీ రెడీ అవుతోంది. ఇందుకోసం రాష్ట్రంలో పార్టీ స్వరూపాన్ని సమూలంగా మార్చేందుకు సిద్ధమవుతోంది.
తెలంగాణ బీజేపీకి చాలాకాలంగా బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత బీజేపీ బాగా పుంజుకుందని అధిష్టానం నమ్ముతోంది. బండి సంజయ్ పనితీరుపై మోదీ, అమిత్, నడ్డా చాలా హ్యాపీగా ఉన్నారు. పలు సందర్భాల్లో ఈ విషయాన్ని బహిరంగంగానే చెప్పారు కూడా. అయితే బండి సంజయ్ మిగిలిన నేతలను కలుపుకుపోవడం లేదనే అపవాదు ఉంది. ముఖ్యంగా కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలను పట్టించుకోవడం లేదనే ఫిర్యాదులు అధిష్టానానికి అందాయి. అందరినీ కలుపుకుపోవడం వల్లే వచ్చిన నేతలు మళ్లీ వెళ్ళిపోతున్నారని చెప్పారు. దీంతో బండి సంజయ్ ని తప్పించాలని హైకమాండ్ భావిస్తున్నట్టు సమాచారం. ఆయనకు కేంద్రమంత్రివర్గంలో స్థానం కల్పించడం ద్వారా ఆయన గౌరవానికి భంగం కలగకుండా చూడాలనుకుంటోది హైకమాండ్.
బండి సంజయ్ స్థానంలో ఈటల రాజేందర్ కు అధ్యక్ష బాధ్యతలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈటల రాజేందర్ చేరికల కమిటీ ఛైర్మన్ గా ఉన్నారు. ఆయన స్వతహాగా సౌమ్యుడు. అందరినీ కలుపుకుపోగల స్వభావం ఉన్న నేత. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరినీ సమానంగా చూడగలడు. ఆయన బీజేపీలోకి వచ్చిన తర్వాత పార్టికి మంచి ఊపు వచ్చింది. ఆయన కూడా తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నాడు. కొత్త, పాత నేతలందరూ ఈటల రాజేందర్ నాయకత్వంపై సుముఖత వ్యక్తం చేశారు. దీంతో ఈటల రాజేందర్ ను పార్టీ అధ్యక్షుడిని చేసి ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ దాదాపు డిసైడైంది.
ఈటల రాజేందర్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తన ఎన్నికల టీమ్ ను రెడీ చేసుకోనున్నారు. ఇందుకోసం హైకమాండ్ దూతలైన సునీల్ బన్సాల్, తరుణు చుగ్, అర్జున్ రామ్ మేఘవాల్.. తెలంగాణ ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించనున్నారు. ఇకపై వీళ్లు ముగ్గరూ ఇక్కడే మకాం వేసి పార్టీని ఎన్నికల వరకూ నడిపించేందుకు సిద్ధమవుతున్నారు. 90 ప్లస్ సీట్లు టార్గెట్ గా ఈ టీం పనిచేయనుంది. ఈ మేరకు అమిత్ షా, మోదీ టార్గెట్ విధించినట్టు సమాచారం. కర్నాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపై పడకుండా ఉన్న నేతలను కాపాడుకుంటూ పెద్దఎత్తున చేరికలను ప్రోత్సహించాలని హైకమాండ్ ఆలోచిస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ లోని అసంతృప్తులను టార్గెట్ చేసి వాళ్లకు వల వేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికీ పలుచోట్ల బీజేపీకి అభ్యర్థులు లేరనే అపవాదు ఉంది. అందుకే నియోజకవర్గాల వారీగా పరిస్థితిని బేరీజు వేసి ఆయా నియోజకవర్గాల్లోని బలమైన నేతలను లాగాలని స్కెచ్ వేసింది. మొత్తానికి త్వరలోనే తెలంగాణ నాయకత్వంలో భారీ మార్పులతో పాటు ఎన్నికలయ్యే వరకూ హైకమాండ్ స్పెషల్ టీం హైదరాబాద్ లో మకాం వేయబోతోంది.













