మిషన్ భగీరథలో కీలక ఘట్టం ఆవిష్కృతం
మిషన్ భగీరథలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఆరు జిల్లాల్లో మిషన్ భగీరథ నీళ్ల పంపిణీకి స్థిరీకరించేందుకు ఉపయోగపడే భారీ ప్రాజెక్టుకు ట్రయల్ రన్ నిర్వహించారు. మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను తరలించేందుకు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మంగోల్ వద్ద రూ.1,212 కోట్లతో నిర్మించిన రిజర్వాయర్‌ను త్వరలోనే ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు ట్రయల్ రన్ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆరు జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, జనగామ, పాలకుర్తి, స్టేషన్ఘనపూర్, ఆలేరు, భువనగిరి, మేడ్చల్ ( రింగురోడ్డు అవుట్ సైడ్) నియోజకవర్గాలకు తాగునీరు అందిస్తారు. గ్రామీణ ప్రాంతంలో ఒక వ్యక్తికి రోజుకు 100 లీటర్లు, మున్సిపాలిటీలో ఒక వ్యక్తికి 135 లీటర్లు అందించేలా ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయ్ అండ్ స్టోరేజీ (హెచ్ఎండబ్ల్యూఎస్)కు వెళ్లే నీటి నుంచి జనగామ, గజ్వేల్, ఆలేరు, భువనగిరి, మేడ్చల్ గ్రిడ్లకు తాగునీటిని అందిస్తున్నారు. 6 జిల్లాల పరిధిలోని 9 నియోజకవర్గాలకు ప్రస్తుతం ఉన్న సిస్టమ్ ద్వారానే గోదావరి జలాలను తరలించి మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి నీటిని సరఫరా చేయనున్నారు.













