కరెంటు కావాలా? లేదంటే కాంగ్రెస్ కావాలా?: కేటీఆర్
ఈసారి తెలంగాణలో అధికారం మాదే అంటున్న కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ‘ట్రైల్బ్లేజర్ తెలంగాణ’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. ‘తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే రైతులకు 24 గంటల విద్యుత్ అందిస్తోంది’ అని వెల్లడించారు. 2014లో తెలంగాణకు ఇప్పటి తెలంగాణను పోల్చిచూపిన ఆయన.. ‘2014లో పర్ క్యాపిటా ఇన్కమ్ రూ.1.24 లక్షల కోట్లుగా ఉండేది. దాన్ని ఇప్పుడు రూ.3.17 లక్షల కోట్లకు పెంచాం. రాష్ట్రంలో 48 వేల కొలనులను పునరుద్ధరించాం. రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు పెట్టి పొలాలకు నీళ్లు అందేలా చూశాం. రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు ట్యాప్ వాటర్ అందిస్తామని హామీ ఇచ్చాం. రూ.37 వేల కోట్లు ఖర్చు పెట్టి మిషన్ భగీరథతో అందరికీ ట్యాప్ వాటర్ అందిస్తున్నాం’ అని తెలిపారు. ఇలా తమ హయాంలో చేసిన అభివృద్ధిని చూపించిన కేటీఆర్.. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 8 గంటల కరెంట్ ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ‘మీకు కరెంట్ కావాలా? కాంగ్రెస్ కావాలా?’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తే మళ్లీ చీకటి రోజులు తప్పవని ఆయన ఇప్పటికే పలుమార్లు హెచ్చరించిన సంగతి తెలిసిందే.













