టీపీసీసీ కొత్త చీఫ్ పేరు ఖరారు.. త్వరలో అధికారికంగా ప్రకటించనున్న హస్తం పార్టీ..
గత కొద్దికాలంగా తెలంగాణ రాజకీయాలలో ఏదో ఒక సంచలనం చోటు చేసుకుంటూనే ఉంది. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడు ఎంపికపై నెలకొన్న ఉత్కంఠత మరి కాసేపట్లో ముగియనుంది. పిసిసి సారధి ఎంపిక ఎట్టకేలకు ఖారారైనట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల నుంచి పీసీసీ అధ్యక్ష పదవి కోసం పలువురు నేతలు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. తమ పేర్లను పరిశీలించాలని అధిష్టాన వర్గాన్ని సైతం ఈ క్యాండిడేట్లు కోరుతూ వచ్చారు. అయితే పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నిర్ణయించాలి అనే విషయంపై పార్టీ వర్గాలు దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఢిల్లీలో ఇటీవల పార్టీ అధిష్టానం లో పలు దఫాలుగా సమావేశాలు నిర్వహణ జరిగింది. ఇందులో పాల్గొన్న రాష్ట్ర నాయకులు పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి తీవ్రంగా చర్చలు కూడా జరిపారు. అందుకే ఈసారి బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రచార కమిటీ సభ్యులు మధుయాష్కీ గౌడ్, ప్రస్తుత కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్ లాంటి ఎన్నో పేర్లను పరిశీలించారు. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్ష పదవి బీసీలకే ఇవ్వడానికి అధిష్టానం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. దీంతో బీసీ వర్గానికి చెందిన నాయకుడే పీసీసీ సారధిగా ఎంపిక అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇంకా ఈ విషయంపై అధిష్టానం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అంతేకాదు అధ్యక్షుడితో పాటు మరికొన్ని పదవులకు కూడా క్యాండిడేట్లను ప్రకటించే అవకాశం ఉంది.
అయితే ఈ రేస్ లో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలు పోటీ పడడం పార్టీని కాస్త కన్ఫ్యూజ్ చేస్తోంది.మధుయాష్కీ, మహేశ్ కుమార్ ప్రస్తుతం ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించిన పెద్దలు ఇద్దరితో వేరువేరుగా మాట్లాడి అభిప్రాయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అన్ని పరిశీలనలను పూర్తయిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ కు బాధ్యతలు అప్పగించడానికి అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయంపై నేడో రేపు అధికారికంగా ప్రకటన కూడా వెలువడనుందని సమాచారం.






