Festival Liquor business: మద్యం అమ్మకాల రికార్డులు.. మత్తుకు బానిసలు అవుతున్న ప్రజలు .

తెలంగాణలో (Telangana) నూతన సంవత్సరం వేడుకలు ( New year celebrations) మద్యం అమ్మకాల్లో కొత్త రికార్డులను సృష్టించాయి. డిసెంబర్ చివరి వారంలో మద్యం వినియోగం విపరీతంగా పెరగడంతో ఎక్సైజ్ శాఖకు (Excise Department) భారీ ఆదాయం లభించింది. ముఖ్యంగా డిసెంబర్ 30, 31 తేదీల్లో జరిగిన అమ్మకాలు అత్యంత స్థాయికి చేరాయి. ఈ రెండు రోజుల్లోనే మద్యం అమ్మకాలు వెయ్యి కోట్ల మార్కును అధిగమించాయి. డిసెంబర్ 31న రూ. 520 కోట్ల విలువైన అమ్మకాలు జరగడంతో ఈ రోజు అత్యధిక విక్రయ దినంగా నిలిచింది.
డిసెంబర్ నెల మొత్తం లెక్కిస్తే, రాష్ట్రవ్యాప్తంగా రూ. 3,800 కోట్ల విలువైన మద్యం విక్రయాలు (Telangana Liquor sales) జరిగాయి. ఈ నెలలో 38 లక్షల కేసుల లిక్కర్, 45 లక్షల బీర్ కేసులు అమ్ముడయ్యాయి. సాధారణ రోజుల్లో మద్యం అమ్మకాలు రోజుకు రూ. 150 నుంచి రూ. 200 కోట్ల వరకు ఉంటే, పండుగల సీజన్, నూతన సంవత్సరం కారణంగా ఈ లెక్క భారీగా పెరిగిపోయింది.
డిసెంబర్ 25 నుంచి 31 వరకు మొత్తం రూ. 1,800 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగడం విశేషం. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రాత్రి 12 గంటల వరకు మద్యం షాపులు తెరిచి ఉంచడంతో విక్రయాల సంఖ్య మరింత పెరిగింది. మందుబాబుల హడావుడి ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టింది.
ఈ పరిస్థితిపై ప్రజల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పండుగల పేరుతో మద్యం వినియోగం పెరుగుతుండటంపై కొందరు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, మరికొందరు దీన్ని ప్రభుత్వానికి కీలక ఆదాయ వనరుగా చూస్తున్నారు. మద్యం వినియోగం సామాజిక, ఆర్థిక ప్రభావాలపై చర్చ జరుగుతోంది. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి సంగతి తెలియదు కానీ మధ్యతరగతి కుటుంబీకుల ఆర్థిక పరిస్థితి మద్య మత్తు కారణంగా మరింత దిగజారిపోతోంది.
నూతన సంవత్సరం వేడుకలు మద్యం వినియోగంపై కొత్త చర్చకు దారితీశాయి. మద్యం వినియోగం నియంత్రణపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరికొంతమంది అయితే, ప్రభుత్వ ఆదాయం దృష్ట్యా మద్యం అమ్మకాలపై పూర్తి నిషేధం సాధ్యం కాదని అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం పక్కన పెడితే నగరాల్లో యువత విరివిగా లభిస్తున్న మద్యం కారణంగా తీవ్రమైన మత్తుకు బానిసలుగా మారిపోతున్నారు.