పాపం ‘ఎర్రదండు’…
తెలంగాణలో వామపక్షాల పరిస్థితి అయ్యో అనేలా మారింది. ఒకప్పుడు ఖమ్మం, నల్లగొండ లాంటి జిల్లాల్లో సత్తా చాటిన వామపక్షాలు…. ఇప్పుడు పొత్తుల కోసం దేబిరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొన్న మునుగోడు ఎన్నికల వేళ పరిస్థితి క్లిష్టంగా మారడంతో.. సీఎం కేసీఆర్ ఎర్రదళాల సాయం తీసుకున్నారు. ఈ పొత్తు సార్వత్రిక ఎన్నికల వేళ ఉంటుందన్నారు. కానీ… తర్వాతి పరిణామాల్లో ఏకపక్షంగా సీట్లను ప్రకటించి గట్టి షాకిచ్చారు. దీంతో కేసీఆర్ తీరుపై వామపక్షనేతలు ఫైరయ్యారు.
ప్రధాన విపక్షం కాంగ్రెస్ తో జట్టుకట్టి బరిలోకి దిగుదామని భావించారు. ఢిల్లీలో పొత్తు చర్చలు జరిపారు. తీరా పొత్తు కన్ఫర్మ్ అవుతుందన్న ఆశతో ఉన్న వామపక్ష నేతలకు.. కాంగ్రెస్ నేతల తీరు షాకిస్తోంది. పొత్తుతోనే వెళ్దామంటూ మాటల్లో చెబుతున్న కాంగ్రెస్ నేతలు.. సీట్ల కేటాయింపునకు మాత్రం ముందుకు రావడం లేదు. దీంతో కాంగ్రెస్ పొత్తు ధర్మాన్ని పాటించడం లేదని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. తమకు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారన్న ఒకే ఒక్క కారణంతో భద్రాచలాన్ని ఇవ్వకపోవడం సమంజసం కాదంటున్నాయి.
ఈ పరిణామాలతో అప్రమత్తమైన సీపీఎం.. ఒంటరిగా రాష్ట్ర ఎన్నికల్లో బరిలోకి దిగుతామని తేల్చేసింది. కాంగ్రెస్ పార్టీ మాట మీద నిలబడడం లేదని, పొత్తు ధర్మాన్ని పాటించడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం దుయ్యబట్టారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము సింగిల్‌గా వెళ్తున్నట్లు చెప్పారు. సీపీఎం 20 స్థానాల నుంచి ఎన్నికల బరిలో ఉంటుందని వెల్లడించారు. 17 నియోకవర్గాల పేర్లను ప్రకటించారు. వాటిల్లో.. పాలేరు, మధిర, వైరా, ఖమ్మం, సత్తుపల్లి, మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్, హుజూర్నగర్, కోదాడ, భద్రాచలం, అశ్వారావుపేట, జనగాం, ఇబ్రహీంపట్నం, పటాన్చెరువు, ముషీరాబాద్, భువనగిరి నియోజకవర్గాలున్నాయి. ఒకట్రెండ్రోజుల్లో ఈ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని తమ్మినేని చెప్పారు. శత్రువును ఎదుర్కొనేందుకు రాజకీయ విజ్ఞత అవసరమని, అది తమ పార్టీకి ఉందని వ్యాఖ్యానించారు.
కేరళలో కాంగ్రెస్ కు సీట్లను పంపిణీ చేసేప్పుడు తమ పార్టీ పొత్తు ధర్మాన్ని పాటించిన విషయాన్ని తమ్మినేని గుర్తుచేశారు. అక్కడ(కేరళలో) మా సిటింగ్ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలను కూడా కాంగ్రెస్ కు కేటాయించాం. ‘‘కాంగ్రెస్ తో పొత్తుపై పలు దఫాలుగా చర్చలు జరిగాయి. ఓ దశలో భట్టి ఫోన్ చేశారు. వైరా ఇస్తామని చెప్పలేదంటూ మాట మార్చారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన మాటకు కూడా ఇక్కడ కట్టుబడి ఉండడం లేదు. మరో కాంగ్రెస్ నేత ఏకంగా పొత్తుల్లేవు.. సీట్లులేవు అంటాడు. అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ, మంత్రిపదవులిస్తామంటారు. పదవులెవరిక్కావాలి?’’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ గెలిచే స్థానాల్లో పోటీ చేసి, ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించకుండా ప్రయత్నిస్తామని చెప్పారు.
నిజానికి కేంద్రంలోని బీజేపీ సర్కారును ఓడించడమే లక్ష్యంగా ‘ఇండియా’ కూటమి ఏర్పడగా.. అందులో సీపీఎం, సీపీఐ కీలక పార్టీలు. తెలంగాణలో మాత్రం ‘ఇండియా’కు ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ తో ఈ రెండు పార్టీలు విభేదించే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే సీపీఎం ఒంటరిపోరుపై ప్రకటన చేయగా.. సీపీఐ కూడా అలాంటి కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తున్నట్లు కనిపిస్తోంది.













