గందరగోళంలో లెఫ్ట్..?
గతమెంతో ఘనకీర్తి..పోరాటాలకు ఆయువుపట్టు…ఉద్యమాలకు ఊపిరిగా నిలిచిన లెఫ్ట్ పార్టీలు..ఇప్పుడు తోకపార్టీలయ్యాయి. ఏదో ప్రాంతీయ పార్టీని అంటిపెట్టుకుని.. వారు విదిల్చే ఒకటి, రెండు సీట్లే ప్రసాదంలా బతుకీడ్చాల్సిన దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత లెఫ్ట్ పార్టీల పరిస్థితి మరింత దైన్యంగా మారింది. అసెంబ్లీలో ఒక్కసీటు కూడా లేని దుస్థితి దాపురించింది. గెల్చిన ఒక్క ఎమ్మెల్యేసైతం కారెక్కశారు. దీంతో సభలో ప్రాతినిథ్యం లేకుండా పోయింది.
మునుగోడులో బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించి, గెలుపులో వామపక్షాలు సాయపడ్డాయి. దీంతో సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేసే ఆలోచన చేశారు సీఎం కేసీఆర్. అయితే ఇరుపక్షాల మధ్య బేరసారాలు కుదరలేదు. దీంతో మొత్తంగా 115 సీట్లకు అభ్యర్థులను ప్రకటించి.. లెఫ్ట్‌కు షాకిచ్చారు. ఇంకేముంది ఉన్న ఒక్క అవకాశం పోవడంతో.. కలిసి పోటీ చేయాలని సీపీఐ, సీపీఎం నిర్ణయానికొచ్చాయి. తమశక్తి ఇంకా పూర్తిగా పోలేదని.. ఈ ఎన్నికల్లో సత్తా చాటతామంటున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో నిర్ణయాత్మక శక్తిగా మారతామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
ఇప్పుడు కాంగ్రెస్ వైపు వామపక్షాలు చూస్తున్నట్లు కనిపిస్తోంది. కలిసివచ్చే వారితో పనిచేస్తామని చెబుతున్నాయంటేనే.. విషయం అర్థమవుతోంది. ఎందుకంటే బీజేపీ, వామపక్షాలు కలిసి పనిచేసే పరిస్థితి లేదు. అంటే.. ఇక మిగిలింది కాంగ్రెస్ మాత్రమే. అందులోనూ కర్నాటక ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ రేసులోకి వచ్చింది. కాంగ్రెస్ కనుక తమ ప్రతిపాదనలకు అంగీకరిస్తే, ఆపార్టీతో కలిసి పోటీ చేయాలని భావిస్తున్నాయి.అయితే ఇప్పటివరకూ కారుతో వామపక్షాలు వెళ్తాయని నిర్ణయానికొచ్చిన హస్తం పార్టీ… సొంతంగా పోటీకి సమాయత్తమైంది . ఇప్పటికే పలుచోట్ల అభ్యర్థులకు హామీలు వచ్చినట్లు సమాచారం. ఎన్నికల ప్రచారం సైతం చాపకిందనీరులా సాగిపోతోంది.మరి ఈసమయంలో కాంగ్రెస్ ఎంతవరకూ సహకరిస్తుందన్నది అనుమానమే.
ఈ పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై వామపక్షాలు దృష్టి సారించాయి. ఈ నెల 27 తర్వాత మరోసారి ఉమ్మడిగా భేటీ అవుతామని, ఆ తర్వాతే కార్యాచరణ ప్రకటిస్తామని వామపక్ష నేతలు వెల్లడించారు. వాస్తవానికి.. ఖమ్మం, నల్లగొండ సహా కొన్ని జిల్లాల్లో వామపక్షాలకు 4 నుంచి 8 శాతం వరకూ ఓటు బ్యాంకు ఉంది. ఈ ఓటు బ్యాంకుతో లెఫ్ట్ పార్టీలు గెలిచే పరిస్థితి లేదు. ఏపార్టీతోనైనా కలిసి వెళ్తే.. ఆపార్టీకి కాస్త లాభం చేకూరే అవకాశముంది. అలా అని..మళ్లీ ఓటు బ్యాంకును పునరుద్ధరించడం.. అంత తేలికైన విషయం కాదన్న సంగతి వామపక్షాలకు సైతం తెలుసు. మరి ఎలాంటి కార్యాచరణ అవలంభిస్తారో వేచిచూడాలి.













