రాజీవ్ విగ్రహంపై వివాదం.. తెలంగాణలో హాట్ పాలిటిక్స్..

తెలంగాణ రాజకీయాల్లో రాజీవ్ గాంధీ విగ్రహం ప్రతిష్టాపన వ్యవహారం నిప్పు రాజేసింది. తెలంగాణ సచివాలయానికి ఎదురుగా రాజీవ్ విగ్రహం ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను .. విపక్ష బీఆర్ఎస్ తీవ్రంగా తప్పుపడుతోంది.అంతటితో ఆగకుండా.. తమ మాట కాదనివిగ్రహం ప్రతిష్టిస్తే…. తప్పనిసరిగా తొలగిస్తామని బహిరంగంగా చెబుతోంది. దీంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా రచ్చకెక్కింది. అయితే .. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ ఏమాత్రం వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు.
తెలంగాణ సచివాలయానికి ఒక వైపు డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఎదురుగా అమరవీరుల స్మారక స్థూపం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ పక్కనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయం తీసుకుని స్థలాన్ని అభివృద్ది చేసింది.ఈ లోపు తెలంగాణ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని నిర్ణయించి చకచకా ఏర్పాట్లు చేసి విగ్రహావిష్కరణకు రాహుల్ గాంధీని కూడా ఆహ్వానించారు.
అయితే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాల్సిన చోట రాజీవ్ విగ్రహం ఎలా పెడతారని, అక్కడ కాకుండా మరెక్కడ పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది. తమ మాట వినకుండా అక్కడ రాజీవ్ విగ్రహం పెడితే భవిష్యత్తులో తాము అధికారంలోకి వచ్చిన తరువాత దానిని తొలగిస్తామని, గత పదేళ్లు అధికారంలో ఉన్నా రాజీవ్ ఆరోగ్యశ్రీ, రాజీవ్ గాంధీ విమానాశ్రయం పేర్లను తాము తొలగించలేదని, కానీ ఈ సారి ఈ పేర్లను కూడా తొలగించి తెలంగాణకు చెందిన మహనీయుల పేర్లను పెడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇక తెలంగాణ కవులు, కళాకారులు, బుద్దిజీవులు, రచయితలు, పాత్రికేయుల పక్షాన ఏకంగా రాహుల్ గాంధీకి బహిరంగలేఖ రాయడం ఈ సంధర్భంగా కొత్త చర్చకు దారితీసింది.
ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ తెలంగాణ సాంస్కృతిక ఆశయాలను గౌరవిస్తామని హామీ ఇచ్చారని, తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ విగ్రహం ఏర్పాటు చేయడం తెలంగాణవాదుల మనోభావాలను గాయపరచడమేనని, అక్కడ కాకుండా మరో చోట విగ్రహం పెట్టుకోవాలని ఈ లేఖలో పేర్కొన్నారు. అయితే.. దీనికి కాంగ్రెస్ సీనియర్ నేతలు ఘాటుగానే బదులిస్తున్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం గాంధీ కుటుంబమని.. అలాంటి నేతల విగ్రహాలు పెడతామంటే ఎందుకు రాద్దాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మాటలతో బీఆర్ఎస్ నేతలు తమ స్థాయిని దిగజార్చుకోవద్దని సూచిస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత.. మీకు ఇష్టం వచ్చిన దగ్గర విగ్రహాు పెట్టుకోవచ్చని.. అంతేకాని రాజీవ్ విగ్రహం జోలికి రావొద్దని సుతిమెత్తగా హెచ్చరిస్తున్నారు.