ఫస్ట్ స్పీచ్‌లోనే అదరగొట్టిన హిమాన్షు.. ఇరకాటంలో కేసీఆర్..!!
హిమాన్షు.. పేరు తెలియని వారుండరు. తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు.. మంత్రి కేటీఆర్ కుమారుడు. నిన్న ఆయన పుట్టిన రోజు సందర్భంగా చాలా చోట్ల బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. అదే సమయంలో హిమాన్షు కూడా ఇటీవల తాను రెనోవేట్ చేయించిన ప్రభుత్వ పాఠశాలను సందర్శించి.. అక్కడ బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. హైదరాబాద్ గౌలిదొడ్డిలోని కేశవనగర్ ప్రభుత్వ పాఠశాలను సుమారు కోటి రూపాయల నిధులు సేకరించి ఆధునీకరించారు. ఈ బాధ్యతను హిమాన్షు చేపట్టారు. 2022లో క్లాస్ లీడర్ అయినప్పుడు కోఆర్డినేటర్ సూచనతో స్కూల్ రూపురేఖలు మార్చాలని డిసైడయ్యారు. ఇప్పుడు అనుకున్నది సాధించారు. హిమాన్షు చేసిన పనికి సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
కేసీఆర్ మనవడు కాబట్టి ఏది చేసినా అది ఆసక్తిగా మారుతుంది. హిమాన్షు కూడా అదే ఆలోచించారు. కేసీఆర్ మనవణ్ణి కాబట్టి ఏదీ నార్మల్ గా చేసే అలవాటు లేదని.. అందుకే ఈ స్కూల్ ను దత్తత తీసుకుని ఆధునీకరించామని చెప్పారు. హిమాన్షు మాట్లాడుతుంటే అచ్చం కేటీఆర్ మాట్లాడుతున్నట్టే అనిపించింది. తొలి స్పీచ్ లోనే హిమాన్షు అదరగొట్టాడంటూ బీఆర్ఎస్ నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. తన పుట్టినరోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తాను మొదటి సారి ఈ స్కూల్ చూసినప్పుడు కళ్లంటీ నీళ్లు వచ్చాయన్నారు హిమాన్షు. కనీస వసతులు కూడా లేవని, బాత్రూంలు లేక ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారని, తినేందుకు డైనింగ్ హాల్ కూడా లేదని.. ప్లే గ్రౌండ్ సరిగా లేక పిల్లలు దెబ్బలు తగిలించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
హిమాన్షు చేసిన పనికి సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు కేసీఆర్ మెడకు చుట్టుకుంటున్నాయి. మీ తాత, మీ నాన్న ఏలుబడిలో ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయో ఇప్పుడు అర్థమైందా.. అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికైనా మీ తాత, నాన్నకు ఈ విషయాన్ని చెప్పి బాగు చేయించాలని సూచిస్తున్నారు. ఈ ఒక్కటే కాదని.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలన్నీ ఇలాగే ఉన్నాయని.. వాటి సంగతి ఏంటని హిమాన్షును నిలదీస్తున్నారు. దీంతో ఇది ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది. హిమాన్షు చేసిన పనికి, అతని మొదటి స్పీచ్ కు మురిసిపోతున్న సమయంలో ఇలాంటి నెగెటివ్ కామెంట్స్ రావడం కేసీఆర్ ఫ్యామిలీ జీర్ణించుకోలేకపోతోంది.
హిమాన్షు కామెంట్స్ పై ట్రోలింగ్స్ మొదలు కావడంతో బీఆర్ఎస్ నేతలు కవర్ చేసుకునేందుకు నానాతంటాలు పడుతున్నారు. నాడు – నేడు పేరుతో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చేందుకు కేసీఆర్ సర్కార్ ప్రయత్నిస్తోందని.. త్వరలోనే అన్ని ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తయారవుతాయని చెప్తున్నారు. అయినా ట్రోలింగ్స్ మాత్రం ఆగట్లేదు. ఏదేమైనా అన్నీ ఒకరోజులో జరగేవి కావు. హిమాన్షు తనకు తోచినంత చేసి స్కూల్ ను బాగు చేయించారు. స్పీచ్ లో కేసీఆర్, కేటీఆర్ ను మైమరపించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ట్రోలింగ్స్ ను పట్టించుకోకుండా సంబరాలు చేసుకుంటున్నాయి.













