KTR: అల్లు అర్జున్ ఇష్యూలో కేటిఆర్ స్మార్ట్’గా సైడ్ అయిపోయారా…?

తెలంగాణలో సంధ్య థియేటర్ ఘటన వ్యవహారం రాజకీయ మలుపులు కూడా తిరగడంతో ఇప్పుడు భారత రాష్ట్ర సమితి (BRS) వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయో అనేదానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. శనివారం శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth reddy) చేసిన వ్యాఖ్యల తర్వాత పరిణామాలు కాస్త వేడెక్కాయి. అదే రోజు సాయంత్రం అల్లు అర్జున్ (Allu arjun) మీడియా సమావేశం ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టడంతో కాంగ్రెస్ పార్టీ కూడా కాస్త ఘాటుగానే స్పందిస్తోంది.
ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. అలాగే ఆ బాధిత కుటుంబానికి 20 కోట్ల రూపాయలను అల్లు అర్జున్ చెల్లించాలని కూడా ఆయన డిమాండ్ చేయడం గమనార్హం. అయితే ఇక్కడ చాలామంది ఆశ్చర్యపోతున్న విషయం ఏమిటి అంటే… ఇంత జరుగుతున్నా సరే… మాజీ మంత్రి కేటీఆర్ (KTR) మాత్రం ఈ వ్యవహారం పై అసలు స్పందించడానికి ఇష్టపడలేదు. అలాగే భారత రాష్ట్ర సమితి నేతలు కూడా ఈ వ్యవహారంలో పెద్దగా జోక్యం చేసుకునే ప్రయత్నం చేయడం లేదు.
వాస్తవానికి ఈ వ్యవహారాన్ని ముందు కేటీఆర్ మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. పదేపదే సీఎం రేవంత్ రెడ్డి పేరు అల్లు అర్జున్ మర్చిపోయారని… అవకాశం ఉన్న ప్రతి వేదికపై ఆయన మాట్లాడారు. కానీ శనివారం శాసనసభలో రేవంత్ రెడ్డి ప్రసంగం తర్వాత కేటీఆర్ సైలెంట్ అయిపోయారు. ఈ వ్యవహారంలో ఆయన సైలెంట్ కావడం వెనక కారణాలు ఏంటి అనే దానిపై స్పష్టత లేకపోయినా… రేవంత్ రెడ్డి ప్రసంగానికి సామాన్యుల్లో కాస్త మైలేజ్ రావడంతో అనవసరంగా జోక్యం చేసుకోవద్దనే భావనలో ఆయన ఉండి ఉండవచ్చు అని కొంతమంది అంటుంటే…
ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కేటీఆర్ పై ఫోకస్ చేయడంతో ఆయన ఆ ఒత్తిడిలో ఉన్నారని, ఏసీబీ కేసుని ముందు తక్కువ అంచనా వేసిన కేటీఆర్ ఆ తర్వాత పరిణామాలు అర్థం కావడంతో కాస్త సైలెంట్ అయ్యారని, ఇప్పుడు ఈ వ్యవహారం నుంచి బయటపడే మార్గాలను అన్వేషించే పనిలో కేటీఆర్ ఉన్నారని మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ స్పందించకపోవడంతో ఈ వ్యవహారంలో భారతీయ జనతా పార్టీ ఎంటర్ అయింది. అల్లు అర్జున్ కు మద్దతుగా కేంద్రమంత్రి బండి సంజయ్ అలాగే ఏపీ బీజేపీ నేతలు కొంతమంది కామెంట్స్ చేశారు.
ఇక ఈ వ్యవహారంలో ఎక్స్ లో కూడా కేటీఆర్ స్పందించే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. శనివారం నుంచి స్వయంగా తాను ఏ పోస్టులు చేయలేదు. కేవలం బీఆర్ఎస్ మద్దతుదారులు చేసిన పోస్టులను మాత్రమే ఆయన రీపోస్ట్ చేస్తూ వస్తున్నారు. అయితే అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడి వ్యవహారంలో ఆయన హస్తం ఉండవచ్చని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.