దీనిపై తొమ్మిదేళ్లుగా కేంద్రాన్ని కోరుతూనే ఉన్నాం… ఇప్పటికీ ఒప్పుకోలేదు
తెలంగాణ నుంచి కేంద్రానికి రూపాయి పోతే 40 పైసలే తిరిగి వస్తోందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమయ్యారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఎదుగుతున్న రాష్ట్రానికి సహకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కేంద్రమే చెబుతోంది. సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ భూముల గురించి కేంద్రాన్ని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాం.రక్షణ శాఖ భూములున్నచోట అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోంది. సికింద్రాబాద్‌లో అభివృద్ధి పనులకు సహకరించాలని కోరాం.
రక్షణశాఖ ఇచ్చే స్థలాలకు సమానమైన భూమిని మరోచోట ఇస్తా. కేంద్ర సంబంధిత భూములిస్తే ప్రజోపయోగ పనులకు వాడతాం. దీనిపై తొమ్మిదేళ్లుగా కేంద్రాన్ని కోరుతూనే ఉన్నాం. ఇప్పటికీ ఒప్పుకోలేదు. రాజీవ్ రహదారిపై స్కైవేల నిర్మాణానికి భూములు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం అని తెలిపారు. మెట్రో రైలు విస్తరణకు కూడా కేంద్రానికి ప్రతిపాదనలు ఇచ్చినట్లు తెలిపారు. కొత్తగా 31. కి.మీ మేర మెట్రోను విస్తరించాలని భావిస్తున్నామన్నారు. అహ్మదాబాద్‌కు భారీగా నిధులిచ్చి హైదరాబాద్‌కు ఇవ్వలేదు. ఎంఎంటీఎస్ విస్తరణకు రాష్ట్ర వాట నిధులు కేటాయించాం. ప్రజారవాణ కోసమే జరుగుతున్న పనులకు కేంద్రం సహకరించాలి. సహకరించకుంటే కేంద్రం వైఖరిని ప్రజల్లో ఎండగడతాం. రాష్ట్రానికి అప్పుగా ఇచ్చిన వాటిని కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు అని విమర్శించారు.













