గులాబీ దళం బీజేపీలో విలీనమవుతుందా…?.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి.. లోక్ సభ ఎన్నికల్లో తొలిసారిగా ఖాతా కూడా తెరవలేకపోయిన భారత రాష్ట్ర సమితి…అత్యంత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కూడా అయిన కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నాలుగు నెలలుగా తిహార్ జైలులో ఉన్నారు. దీంతోపాటు పదేళ్ల కేసీఆర్ పాలనపై తెలంగాణ ప్రభుత్వం తవ్వకాలు చేపడుతోంది. మేడిగడ్డ కుంగడం సహా విద్యుత్తు కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ జరుపుతోంది. మరోవైపు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికార కాంగ్రెస్ లోకి జంప్ అవుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో విలీనం వార్తలు బీఆర్ఎస్ ను కలవరపరుస్తున్నాయి. ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి, గులాబీదళం సహకరించిందని ఫలితంగానే కమలనాథులకు 8 స్థానాలు దక్కాయన్న వాదనను కాంగ్రెస్ గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీనర్థం బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అంటూ ప్రచారం చేసింది. అయితే ప్రధాన విపక్షం అభ్యర్థులు పలుచోట్ డిపాజిట్లు కోల్పోవడంతో విమర్శలకు ఊతం ఇచ్చింది. మరోవైపు ఢిల్లీ మద్యం స్కాంలో జైలుకెళ్లిన కవితను బయటకు తీసుకురావడానికి బీజేపీతో బీఆర్ఎస్ ఒప్పందం కుదుర్చుకుందనే ఆరోపణలూ ఉన్నాయి.
పలు మీడియా సంస్థలు కూడా ఈ మేరకు కథనాలు ప్రచురించాయి. కేటీఆర్ మండిపాటు.. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కథనాలను మరీ ముఖ్యంగా ఆ మీడియా సంస్థలో కథనం రావడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ సేవలందిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. తమపై కథనాలు రాసినవారు వెంటనే ఖండన తెలియజేయాలని డిమాండ్ చేశారు. పడతాం.. లేస్తాం.. తెలంగాణ ప్రజలకు సేవ చేస్తాం.. అని కేటీఆర్ కుండబద్దలు కొట్టారు.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కమలానికి మద్దతివ్వడం లేదా గట్టిగా నిలబడి కొట్లాడడం .. ఈరెండు ఆప్షన్లే బీఆర్ఎస్ ముందున్నాయి. మరీ ముఖ్యంగా మోడీ హయాంలో విపక్షనేతలు వరుసగా జైలుకెళ్లడం.. లాలూ లాంటి వారైతే దశాబ్దానికిపైగా జైల్లో ఉండడం అందరికీ తెలిసిందే.ఈనేపథ్యంలో మోడీని కాదని వ్యతిరేకంగా నిలబడితే.. గులాబీదళానికి మరిన్ని కష్టాలు తప్పవన్న భావన.. ఆవర్గం నేతల్లోనూ కనిపిస్తోంది. ఈపరిస్థితులను చూసే చాలా మంది సీనియర్లు సైతం.. పార్టీ నుంచి వేరే పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. నిలబడి కొట్లాడదామని అధినేత చెబుతున్నా.. ఎవరూ పట్టించుకున్న పరిస్థితి కనిపించడం లేదు.