కేటీఆర్ ప్రకటన.. ఇరకాటంలో వైసీపీ..!?
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేటీఆర్ మద్దతు ప్రకటించారు. అవసరమైతే కేసీఆర్ పర్మిషన్ తీసుకుని కొంతమంది టీఆర్ఎస్ ప్రతినిధుల బృందం విశాఖ వెళ్లి కార్మికులకు అండగా నిలుస్తామని ప్రకటించారు. ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ కు పట్టిన గతే.. రేపు తెలంగాణలోని బీహెచ్ఈఎల్, సింగరేణి లాంటి సంస్థలకు కూడా పట్టొచ్చన్నారు. అందుకే ఇలాంటి సమస్యలపై ఉమ్మడిగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మద్దతుగా కేటీఆర్ చేసిన ప్రకటన సంచలనం కలిగించింది. ఆయన ప్రకటనను అటు కార్మిక సంఘాలు, ఇటు రాజకీయ నేతలు స్వాగతించారు. ఉద్యమానికి మద్దతుగా రాజీనామా చేసిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. కేటీఆర్ ప్రకటనను స్వాగతించారు. పవన్ కల్యాణ్ కూడా ప్రత్యక్ష కార్యాచరణలోకి రావాలని కోరారు. అలాగే.. సీపీఐ నారాయణ కూడా కేటీఆర్ మద్దతివ్వడాన్ని హర్షించారు. ఏపీ మంత్రి అనిల్ కూడా కేటీఆర్ ప్రకటనను స్వాగతించారు.
బీజేపీపై టీఆర్ఎస్ సర్కార్ ప్రదర్శిస్తున్న దూకుడు వైసీపీ సర్కార్ ప్రదర్శించట్లేదనే విమర్శలు వినిపిస్తున్న వేళ.. కేటీఆర్ ప్రకటన పుండుపై కారం చల్లినట్లయింది. ఇప్పుడు వైసీపీ నేతలు మరింత దూకుడు పెంచాల్సిన అవసరం కనిపిస్తోంది. కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేలా వైసీపీ వ్యవహరించకపోతే ఇబ్బందులు తప్పకపోవచ్చనేది అంచనా. మరి వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందనేది చూడాలి.
అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది. కేంద్రంతో పైట్ చేసేందుకు కలిసి కొట్లాడదామంటూ కేటీఆర్ చేసిన ప్రకటన అధికార వైసీపీపై ఒత్తిడి పెంచేలా కనిపిస్తోంది. కేంద్రంలోని బీజేపీపై వైసీపీ పోరాటం అనుకున్నంత స్థాయిలో లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారపక్షం కేవలం లెటర్లతోనే సరిపెడుతోందని.. ప్రత్యక్ష కార్యాచరణలోకి రావట్లేదని కార్మికులు, ఇతర పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు పక్కరాష్ట్రంలోని అధికారపక్షం పోరాటానికి సిద్ధమైందని.. ఇక్కడి పాలకపక్షం మాత్రం ఇంకా మీనమేషాలు లెక్కిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.













