బీజేపీకి షాక్..
ఎన్నికల ముందు తెలంగాణలో బీజేపీకి షాక్ తగిలింది. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో కాంగ్రెస్లో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత అధికంగా ఉందన్న రాజగోపాల్ రెడ్డి… బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగి, తర్వాత బీజేపీ డీలా పడిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారన్న రాజగోపాల్ రెడ్డి.. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించాలని నిర్ణయించుకుంటున్నట్లు తెలిపారు.
‘‘రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉంది. ప్రజలు మార్పును కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. కేసీఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలి. నా ఆశయం ఐదు వారాల్లో నెరవేరుతుందని భావిస్తున్నానన్నారు రాజగోపాల్ రెడ్డి. అంతేకాదు.. తాను ఏనాడూ పదవుల కోసం ఆరాటపడలేదన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసమే తపన పడ్డాను’’ అని రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
మునుగోడు ఉపఎన్నిక ముందు రాజగోపాల్ రెడ్డి.. బీజేపీలో చేరారు. బీజేపీ తరపున మునుగోడులో పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి.. బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే.. అప్పటి నుంచి రాజగోపాల్ రెడ్డి… ఇతర పార్టీల్లో చేరతారని ప్రచారం ఊపందుకుంది. ఇతర పార్టీల నేతలతో రహస్యంగా సమావేశాలు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. వాటన్నింటినీ రాజగోపాల్ రెడ్డి ఖండిస్తూ వచ్చారు. తాను తన అనుచరులు, అభిమానులతో భేటీ అయితే.. దానికెందుకంత రాద్దాంతమన్నారు.
ఎప్పుడైతే కాంగ్రెస్ బలోపేతమవుతుందన్న అంచనాలు, హైకమాండ్ పటిష్ట వ్యూహం అనుసరిస్తుండడం.. మరీ ముఖ్యంగా అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాబీయింగ్ వెరసి… రాజగోపాల్ రెడ్డి హస్తం బాటపట్టారు. రాజగోపాల్ రెడ్డి ఆరోపణలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. వెళ్లిపోయేవారు అనుకుంటే బీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయం కాకుండా పోదన్నారు. మరోవైపు.. పార్టీపై నిందలు వేయడం సరికాదన్నారు ఎంపీ లక్ష్మణ్. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిని.. పాసింగ్ క్లౌడ్ గా అబివర్ణించారు జితేందర్ రెడ్డి. పాసింగ్ క్లౌడ్స్ వచ్చిపోతుంటాయి. పార్టీ మాత్రం పటిష్టంగానే ఉందన్నారు జితేందర్ రెడ్డి.













