కేసీఆర్ అది నీ స్థాయి.. తెలంగాణ పరువు తీస్తున్నావ్
సీఎం కేసీఆర్ బీహార్ పర్యటనపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ కేసీఆర్ను సీరియస్గా తీసుకోవడం లేదన్నారు. కేంద్రంపై విమర్శలు చేసేందుకే కేసీఆర్ పర్యటనలు చేస్తున్నారు. కేసీఆర్ తీరును చూసి తెలంగాణను చూసి నవ్వుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఇతర రాష్ట్రాల్లో పార్టీలు కేసీఆర్ను లైట్ తీసుకున్నాయి. బీహార్ వెళ్లి ఏదో చెప్పాలనుకున్నారు. కేసీఆర్ మాటలు వినలేక బిహార్ సీఎం నితీష్ కుమార్ వెళ్లిపోతుంటే కేసీఆర్ బ్రతిమాలుకున్నారు. కానీ, ప్రతిపక్ష పార్టీలను ఏకం చేస్తానని కేసీఆర్ చెబుతున్నారు. కేసీఆర్ మాటలు విని సీఎం నితీష్ కుమార్ నవ్వుకున్నారు.
ప్రజలకు అందుబాటులో ఉండకుండా ఉండటమే తెలంగాణ మోడలా. తెలంగాణ డబ్బులు తెచ్చి బీహార్, పంజాబ్లో పంచుతున్నారు. తెలంగాణను ఉద్ధరించానని చెబుతూ దేశమంతా తిరిగి ప్రచారం చేస్తున్నారు. మునావర్ ఫరూకీ షోకు అంత పెద్ద ఎత్తున భద్రత కల్పించి నిర్వహించాల్సిన అవసరం ఏముంది. ఈడీ, సీబీఐలను చూసి ఎందుకు భయపడుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని బిహార్లో పర్యటించారో చెప్పాలన్నారు. మేకిన్ ఇండియాకు కేంద్రం ప్రాధాన్యం ఇస్తోంది. వైద్య పరికరాల దిగుమతి తగ్గించి ఎగుమతికి కృషి చేస్తున్నాం అని తెలిపారు.













