నల్లారి, ఈటలకు తెలంగాణ బీజేపీలో కీలక బాధ్యతలు..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. మరో నాలుగు నెలలే సమయం ఉంది. ఈ ఎన్నికల్లో బీజేపీ పనైపోయిందని భావిస్తున్న వేళ ఆ పార్టీ మళ్లీ స్పీడ్ పెంచింది. క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలపై హైకమాండ్ ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తోంది. పార్లమెంటు సమావేశాలు జరుగుతుండడంతో పార్టీ కీలక నేతలంతా ఢిల్లీలోనే ఉన్నారు. దీంతో అమిత్ షా, నడ్డా లాంటి నేతలు తెలంగాణ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తాజా పరిస్థితిని అంచనా వేశారు. ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అందులో భాగంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఈటల రాజేందర్ సేవలను విస్తృతంగా వాడుకోవాలని హైకమాండ్ నిర్ణయించింది.
కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉండిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవలే బీజేపీలో చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉండడంతో ఆయనకు విస్తృత పరిచయాలున్నాయి. ఆ పరిచయాలను పార్టీకోసం వాడుకోవాలనుకుంటోంది బీజేపీ. కాంగ్రెస్ పార్టీలో చిన్నస్థాయి నేతలు కూడా కిరణ్ కుమార్ రెడ్డికి తెలుసు. కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతలను బీజేపీలోకి తీసుకొచ్చే బాధ్యతను కిరణ్ కుమార్ రెడ్డికి అప్పగించింది. వాస్తవానికి కిరణ్ కుమార్ రెడ్డి సేవలను ఏపీలో ఎక్కువగా వాడుకోవాలనుకున్నా.. అక్కడ పార్టీ కనీసం పోటీ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అందుకే ప్రస్తుతానికి తెలంగాణపై ఫోకస్ పెట్టాలని సూచించింది. ప్రస్తుతం నల్లారి ఆ పని మీదే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తులపై ఆయన కన్నేశారు. ఆయనకు సహాయం చేసే బాధ్యతలను డీకే అరుణకు అప్పగించారు.
మరోవైపు ఈటల రాజేందర్ చేరిన తర్వాత బీజేపీకి హైప్ వచ్చింది. ఉద్యమ నేతగా ఉండి కేసీఆర్ కుడిభుజంగా వ్యవహరించారు ఈటల. అలాంటాయన ఆ పార్టీకి వదిలేసి రావడంతో బీజేపీ సంబరాలు చేసుకుంది. అయితే ఈటల పార్టీలో ఇమడలేని పరిస్థితి ఏర్పడింది. ఇదే విషయాన్ని ఆయన హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లడంతో అందుకు తగ్గట్టు పార్టీలో మార్పులు చేసింది. దీంతో ఈటల రాజేందర్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. ప్రస్తతం బీఆర్ఎస్ లో అసంతృప్తులతో పాటు కీలక నేతలను పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యతను ఈటల రాజేందర్ భుజాలపై పెట్టింది హైకమాండ్. గతంలో ఆయన చేరికల కమిటీ ఛైర్మన్ గా పలువురిని పార్టీలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ బాధ్యతలతో పాటు పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ గా కూడా వ్యవహరించనున్నారు.
కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో బీజేపీ ఆశలు వదిలేసుకుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా రేసులో ముందుకొచ్చింది. అయితే బీజేపీ మాత్రం అవకాశాన్ని జారవిడుచుకోదలుచుకోలేదు. ఎన్నికల్లో గట్టి ఫైట్ ఇవ్వాలనుకుంటోంది. ప్రధాన నేతలందరినీ అసెంబ్లీ బరిలో దింపాలని నిర్ణయించింది. త్రిముఖ పోరులో కచ్చితంగా తమకే ఎడ్జ్ ఉంటుందని బీజేపీ నమ్ముతోంది.













