కొండగట్టుకు అదనంగా మరో రూ.500 కోట్లు : కేసీఆర్
జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న క్షేత్ర అభివృద్ధికి అదనంగా మరో రూ.500 కోట్లు కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తొలుత కొండగట్టు ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం బస్సులో ప్రధాన ఆలయానికి చేరుకున్నారు. ఆలయ పండితులు పూర్ణకుంభంతో ముఖ్యమంత్రి కేసీఆర్కు స్వాగతం పలికారు. దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత తొలిసారి జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రానికి వచ్చిన కేసీఆర్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పండితులు సీఎం కేసీఆర్కు వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణానికి సంబంధించి అధికారులతో కేసీఆర్ దాదాపు రెండు గంటల పాటు పైగా సమీక్షించారు. కొండగట్టు అభివృద్ధికి ఉన్న అనుకూల, ప్రతికూల అంశాలపై తొలుగా విశ్లేషించారు.
దేశంలోనే అతిపెద్ద హనుమాన్ క్షేత్రం అంటే కొండగట్టే అనాలి. ప్రపంచాన్నే ఆకర్షించే అద్భుత ఆధ్మాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దాలి. భక్తులకు అన్ని వసతులు, సకల హంగులతో అభివృద్ధి చేయాలి. ప్రమాదాలకు తావులేకుండా ఘాట్ రోడ్డులను మార్చాలి. సుమారు 850 ఎకరాల్లో ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు చేపట్టాలి. పెద్దవాల్, పుష్కరిణి, అన్నదాన సత్రం, పార్కింగ్ ఏర్పాటు చేయాలి. దేశంలోనే గొప్పగా హనుమాన్ జయంతి కొండగట్టులో జరగాలి. వేలాది మంది ఒకేసారి హనుమాన్ దీక్ష ధారణ, విరమణ చేసే సయమంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి. 86 ఎకరాల్లో సువిశాల పార్కింగ్ ఏర్పాటు చేయాలి. తొలుత ప్రకటించిన రూ.100 కోట్లకు అదనంగా మరో రూ.500 కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తాం. మళ్లీ వస్తా. ఆలయ అభివృద్ధి, విస్తరణపై సమీక్ష నిర్వహిస్తా అని సీఎం కేసీఆర్ తెలిపారు.













