గజ్వేల్.. కామారెడ్డి.. రెండు చోట్ల కేసీఆర్ పోటీ ఎందుకు..?
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రెండు అసెంబ్లీ సీట్లలో బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. పార్టీ నిర్ణయించింది కాబట్టి పోటీ చేస్తున్నట్టు చెప్పారాయన. అయితే రెండు చోట్ల పోటీపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒక చోట ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్ రెండో స్థానాన్ని ఎంచుకున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఉత్తర తెలంగాణలో క్లీన్ స్వీప్ చేసేందుకే ఆయన రెండో స్థానం నుంచి పోటీ చేయబోతున్నారని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ మెదక్ జిల్లా గజ్వేల్ నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఆయన రెండు సార్లు అక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు. ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఫాంహౌస్ కూడా గజ్వేల్ పరిధిలోనే ఉంది. దీంతో అది ఆయన కంచుకోటగా మారింది. ఫాంహౌస్ లో నిత్యం ఆయన అందుబాటులో ఉంటున్నారు. గజ్వేల్ ప్రజలు కూడా కేసీఆర్ ను అక్కున చేర్చుకున్నారు. ఆయన కూడా గజ్వేల్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేశారు. ఇప్పుడు కూడా ఆయన మరోసారి గజ్వేల్ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో గజ్వేల్ నుంచి ఆయన హ్యాట్రిక్ కొట్టడం ఖాయమనుకుంటున్నారు.
అయితే కేసీఆర్ ఈసారి గజ్వేల్ కు మాత్రమే పరిమితం కాలేదు. కామారెడ్డి నుంచి కూడా బరిలోకి దిగబోతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తో పాటు జిల్లా నేతలు తనను కామారెడ్డి నుంచి బరిలోకి దిగాలని కోరుతున్నారని.. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నామని కేసీఆర్ వెల్లడించారు. తాను గతంలో కూడా ఒకే నియోజక వర్గానికి పరిమితం కాలేదని చెప్పుకొచ్చారు. కరీంనగర్ తో పాటు మహబూబ్ నగర్ నుంచి కూడా ఎంపీగా గెలిచినట్టు చెప్పారు. అయితే ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ కు మంచి పట్టుంది. ఆ పట్టును మరింత పెంచుకునేందుకే ఆయన కామారెడ్డి నుంచి బరిలోకి దిగుతున్నారని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు.
విపక్షాలు మాత్రం గజ్వేల్ లో ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్ కామారెడ్డిని ఎంచుకున్నారని విమర్శిస్తున్నాయి. ఈసారి తాను గజ్వేల్ నుంచి బరిలోకి దిగబోతున్నట్టు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గతంలోనే ప్రకటించారు. దీంతో ఈసారి కేసీఆర్, ఈటల రాజేందర్ మధ్య టఫ్ ఫైట్ ఉంటుందనుకున్నారు. ఒకవేళ ఏదైనా అనుకోనిది జరిగితే కేసీఆర్ కు చెడ్డపేరు వస్తుంది. అందుకే ముందు జాగ్రత్తగా గజ్వేల్ తో పాటు కామారెడ్డిని ఎంచుకున్నారనే టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ నేతలు మాత్రం కేసీఆర్ కు అలాంటి పరిస్థితే రాదని కొట్టి పారేస్తున్నారు. ఏదేమైనా కేసీఆర్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తుండడం సంచలనం కలిగిస్తోంది.













