పార్టీ కోసం ప్రత్యేక విమానం కొనుగోలు.. కేసీఆర్ స్టయిలే వేరు..!
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. దసరా రోజున అంటే అక్టోబర్ 5న జాతీయ పార్టీ ప్రకటించేందుకు ఆయన రెడీ అయ్యారు. ఇందుకోసం ముందస్తు కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. దసరా లోపు మరికొన్ని ఆలయాలను కూడా సందర్శించేలా కేసీఆర్ షెడ్యూల్ రెడీ చేసుకున్నారు. కేసీఆర్ కు ఆధ్యాత్మికత ఎక్కువ. అందుకే ఏ కార్యం తలపెట్టినా ముందు గుళ్లు చుట్టి వస్తుంటారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. ఇవన్నీ రొటీన్ విషయాలే. అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే కేసీఆర్ విమానం కొనడం.! ఇదే ఇప్పుడు నేషనల్ లెవల్లో ఆసక్తి కలిగిస్తున్న అంశం.
దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టాయి.. ఎంతో మంది నేతలు గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి వరకూ ఎదిగారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఏ పదవినైనా చేపట్టే అవకాశం ఉంటుంది. కేసీఆర్ కూడా తెలుగుదేశంలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ప్రత్యేక తెలంగాణకోసం పోరాడి విజయం సాధించారు. ఎనిమిదేళ్లుగా తెలంగాణలో ఉన్న కేసీఆర్.. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో తన ప్రభావం చూపించాలని ఉబలాటపడుతున్నారు. బీజేపీ సర్కార్ ను ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో గద్దె దించాలనేది ఆయన ప్లాన్. అందులో భాగంగానే ఆయన జాతీయ పార్టీ పెడుతున్నారు.
జాతీయ పార్టీని నడపడం అంటే ఆషామాషీ కాదు. దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించాల్సి ఉంటుంది. ప్రాంతీయ పార్టీ నేత ఒకరు జాతీయ పార్టీని పెట్టి నడపడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఇందుకు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటివి కేసీఆర్ కు కొత్త కాదు. అయితే ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్ లో కేసీఆర్ ఏమేరకు ప్రభావం చూపుతారనేదానిపైనే ఆయన తర్వాతి భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే బీజేపీ టీఆర్ఎస్ ను నేరుగా టార్గెట్ చేసింది. కేసీఅర్ కుటుంబానికి అవినీతి మరక అంటిందనే ప్రచారం చేస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి బుల్డోజర్లు కూడా వస్తాయని హెచ్చరిస్తోంది.
ఇలాంటి సమయంలో కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడం.. అందుకోసం ప్రత్యేక విమానాన్ని కొనుగోలు చేయడం అత్యంత చర్చనీయాంశంగా మారింది. దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలున్నాయి. అయినా ఏ పార్టీ కూడా ప్రత్యేకంగా తమ అవసరాలకోసం ఏరోప్లేన్ కొనలేదు. దేశవ్యాప్తంగా విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. మరీ అవసరం అయితే ప్రైవేట్ జెట్స్ ఉన్నాయి. వాటినే వినియోగించుకుంటున్నారు. అయితే కేసీఆర్ స్టైల్ మాత్రే వేరే. ఆయన ఏకంగా పార్టీ తరపున ఒక ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు.
ఇప్పటికే బీజేపీ కేసీఆర్ పైన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. ఇప్పుడు వాటికి మరింత పదును పెట్టే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కుటుంబానికి హస్తం ఉందని బీజేపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు విమానం కొనుగోలు చేయడం ద్వారా తమ ఆరోపణలను నిజమేనని మరింత దూకుడు పెంచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి.. కేసీఆర్ విమాన కొనుగోలుపై విరుచుకు పడుతున్నారు. దేశంలో మహామహా నేతలకే ప్రైవేటు విమానాలు లేవు. అలాంటప్పుడు కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పడు దేశవ్యాప్తంగా చర్చకు కారణమైంది. మరి దీన్ని కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారనేది వేచి చూడాలి.













