KCR: అసెంబ్లీకి ‘గులాబీ’ బాస్… వ్యూహం మారిందా? అనివార్యమా?
తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర ఘట్టానికి తెరలేవబోతోంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత చట్టసభలకు దూరంగా ఉంటూ వచ్చిన ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు (KCR) ఎట్టకేలకు మౌనం వీడారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ఆయన హాజరుకావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే, ఇది కేవలం అధికార పక్ష సవాళ్లకు స్పందనా? లేక పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు చుట్టూ అలుముకున్న రాజకీయమే ఆయన్ను అసెంబ్లీ బాట పట్టించిందా? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. “కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు?” అంటూ నిత్యం ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఉండి కూడా సభకు రాకపోవడంపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయన్న ఆందోళన గులాబీ శ్రేణుల్లోనూ ఉంది. ఈ నేపథ్యంలో శనివారం ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో జరిగిన కీలక సమావేశం బీఆర్ఎస్ వైఖరిలో మార్పును సూచిస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల నేతలతో కేసీఆర్ సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రధానంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై చర్చించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతోందని ఆరోపిస్తున్న బీఆర్ఎస్, అసెంబ్లీ వేదికగా దీనిపై గట్టిగా గళం విప్పాలని నిర్ణయించింది. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, గతంలో తాను అధికారంలో ఉన్నప్పుడు చేసినట్లుగా, అసెంబ్లీలో ప్రాజెక్టుల పురోగతి, నీటి లభ్యతపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (PPT) ఇవ్వడానికి అనుమతి కోరాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇది అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టే ఎత్తుగడగా విశ్లేషకులు భావిస్తున్నారు.
కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారన్న వార్త బీఆర్ఎస్ క్యాడర్లో జోష్ నింపినప్పటికీ, ఆయన ఎంతసేపు ఉంటారు? ఎన్ని రోజులు వస్తారు? అన్నదానిపై ఇంకా సందిగ్ధత వీడలేదు. గత బడ్జెట్ సమావేశాల సమయంలోనూ కేసీఆర్ తొలిరోజు మాత్రమే వచ్చి, ఆ తర్వాత కనిపించలేదు. ఇప్పుడు కూడా ఆయన సోమవారం హాజరై, ఆ తర్వాత సభకు దూరంగా ఉండే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.
ఒకవేళ అదే జరిగితే, అది బీఆర్ఎస్కు లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తుందన్న విశ్లేషణలు ఉన్నాయి. కేసీఆర్ సభకు వచ్చి, పూర్తిస్థాయిలో చర్చలో పాల్గొనకుండా వెళ్లిపోతే.. “సమాధానం చెప్పలేక పారిపోయారు” అని ముద్ర వేసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంటుంది. ఇప్పటికే కాంగ్రెస్ వ్యూహకర్తలు కేసీఆర్ రాకకోసం ఎదురుచూస్తున్నారు. ఆయన సభలో ఉంటే కృష్ణా, గోదావరి జలాలతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలను ఎత్తిచూపుతూ నేరుగా ఆయననే బోనులో నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. ఈ రాజకీయ దాడిని కేసీఆర్ ఎలా తిప్పికొడతారన్నదే అసలైన సవాలు.
అసెంబ్లీ లోపల పోరాటంతో పాటు, బయట కూడా ప్రజా ఉద్యమాలు నిర్మించాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ నిర్ణయించింది. అంటే అసెంబ్లీ సమావేశాలను ఒక వేదికగా వాడుకుని, ఆ తర్వాత క్షేత్రస్థాయి రాజకీయ పోరాటానికి తెరలేపాలని బీఆర్ఎస్ భావిస్తోంది.
మరోవైపు అధికార కాంగ్రెస్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. నీటి పారుదల శాఖపై పూర్తి పట్టున్న కేసీఆర్‌ను ఢీకొట్టేందుకు మంత్రులు, సభ్యులకు ప్రత్యేక అవగాహన కల్పిస్తోంది. ఒకటో తేదీన పార్టీ సభ్యులకు కృష్ణా-గోదావరి జలాలపై క్లాస్ తీసుకోనుంది. కేసీఆర్ పీపీటీ ఇవ్వాలనుకుంటే, ప్రభుత్వం కూడా గత పదేళ్లలో జరిగిన ప్రాజెక్టుల నిర్వహణ లోపాలను, ఆర్థిక భారాలను గణాంకాలతో సహా బయటపెట్టేందుకు సిద్ధమవుతోంది.
మొత్తానికి సోమవారం ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగడం ఖాయం. కేసీఆర్ రాకతో సభలో రాజకీయ వేడి తారస్థాయికి చేరనుంది. జల వివాదాలపై చర్చ జరిగితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, కేసీఆర్ పూర్తి స్థాయి చర్చకు అందుబాటులో ఉంటారా? లేక తన వాదన వినిపించి నిష్క్రమిస్తారా? అనే దానిపైనే తదుపరి రాజకీయ పరిణామాలు ఆధారపడి ఉంటాయి. ఒకవేళ ఆయన సభను సీరియస్‌గా తీసుకుని, అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కొంటే మాత్రం.. అది బీఆర్ఎస్ పునరుజ్జీవనానికి తొలి మెట్టు అవుతుంది. లేదంటే, కాంగ్రెస్ విమర్శలకు మరింత బలం చేకూర్చినట్లవుతుంది.






