50 ఏళ్ల పాలించిన కాంగ్రెస్ తో.. మన బతుకులు మారాయా?
దేశాన్ని 50 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్తో మన బతుకులు మారాయా? అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా దేశంలో రావాల్సిన ప్రజాస్వామ్య పరిణతి ఇంకా రాలేదని అన్నారు. పార్టీల చరిత్ర, నడవడిక చూసి ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసమని తెలిపారు. ఎన్నికలు అనగానే ఎందరో వస్తున్నారు. ఏవేవో మాట్లాడుతున్నారు. ఓటు వేసే ముందు ప్రజలు అన్నీ ఆలోచించి వేయాలి. నిజానిజాలు గమనించి ఓటు వేయాలని కోరుతున్నా. పదేళ్ల ముందు పాలకుర్తి ఎలా ఉంది. ఇప్పుడెలా ఉందో ప్రజలు ఆలోచించాలి. గతంలో ఇక్కడి నుంచి వేల మంది వలసపోయేవారు. ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో లక్షా 30 వేల ఎకరాలకు సాగునీరిచ్చాం అని అన్నారు. రైతుబంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారని మండిపడ్డారు. 24 గంటల విద్యుత్ వద్దని, 3 గంటలు చాలని పీసీ అధ్యక్షుడే చెబుతున్నారని, నాయకుల గోల్మాల్ మాటలు విని ఆగం కావొద్దని ప్రజలను ఆయన కోరారు.













