షర్మిల, విజయమ్మలపై కేసీఆర్ సర్కార్ కరుణ!
కొన్ని సంఘటనలు చిత్రవిచిత్రంగా కనిపిస్తుంటాయి మనకు. అలాంటి వాటిని చూసినప్పుడు లేదా విన్నప్పుడు.. ఇదెలా జరిగింది.. అని ఆశ్చర్యపోతుంటాం. తాజాగా.. ఓ సంఘటన అలాంటి ఆశ్చర్యానికి గురిచేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎప్పుడో 8ఏళ్ల కిందట జరిగిన ఓ సంఘటన వై.ఎస్. విజయమ్మ, షర్మిల మెడకు చుట్టుకుంది. అప్పటి నుంచి వాళ్లిద్దరూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. రాష్ట్రం విడిపోయినా.. తెలంగాణతో వీళ్లకు ఎలాంటి సంబంధం లేకపోయినా.. ఇంకెన్నాళ్లీ తిప్పలు.. అని అందరూ చర్చించుకుంటున్నారు.
2012 నాటి సంగతి ఇది. అప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ బయటికొచ్చి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ పెట్టారు. ఆ పార్టీ తరపున జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిల పరకాలలో పర్యటించారు. నాడు వై.ఎస్. కుటుంబానికి అత్యంత ఆప్తులుగా పేరొందిన కొండా సురేఖ దంపతులు ఇందులో పాల్గొన్నారు. ఇది సహించని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వారిపై కేసు పెట్టింది. నిబంధనలకు వ్యతిరేకంగా వారి ప్రచారం సాగిందంటూ ఆగ్రహించింది. కానీ కాలం గడిచిపోయింది. తెలంగాణ విడిపోయింది. కానీ ఈ కేసు మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ పలు దఫాలు వీళ్లంతా కోర్టుకు హాజరయ్యారు.
అయితే.. ప్రస్తుత కేసీఆర్ ప్రభుత్వం ఈ కేసుకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. విజయమ్మ, షర్మిలపై కేసును ఉపసంహరించుకునేందుకు సిద్ధమైంది. ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సత్వరం తేల్చాల్సి ఉందని.. ఎక్కువ రోజులు వాయిదా వేయలేమని కోర్టు స్పష్టం చేసింది. దీంతో కేసులను ఉపసంహరించుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైందని.. సంబంధిత అధికారులు ఉత్తర్వులకోసం వస్తారని పీపీ మెమో దాఖలు చేశారు. దీంతో కేసును ఈ నెల 31కి వాయిదా వేసిన ప్రజాప్రతినిధుల కోర్టు.. ఆ రోజు నిందితులందరూ కోర్టుకు తప్పక హాజరు కావాలని ఆదేశించింది.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ కేసులు విజయమ్మ, షర్మిలతో పాటు కొండా దంపతులు కూడా నిందితులుగా ఉన్నారు. అయితే విజయమ్మ, షర్మిల పైన మాత్రమే కేసీఆర్ సర్కార్ కేసును ఉపసంహరించుకున్నట్టు తెలుస్తోంది. కొండా దంపతులపై మాత్రం కేసును కొనసాగిస్తోంది. ఇదే విషయాన్ని కోర్టు కూడా అడిగింది. దీనిపై సమాధానాన్ని దాటవేసింది ప్రభుత్వం. అయితే విజయమ్మ, షర్మిలపై మాత్రమే ఇప్పుడు అకస్మాత్తుగా ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందనేది ఆశ్చర్యం కలిగిస్తోంది. అదే సమయంలో కొండా దంపతులపై మాత్రం కేసును కంటిన్యూ చేయడం పక్షపాత ధోరణికి అద్దం పడుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. విభజన అనంతరం టీఆర్ఎస్ లో చేరిన కొండా దంపతులు.. ఆ పార్టీలో ఎక్కువ రోజులు ఉండలేక బయటకు వెళ్లిపోయారు.













