జగన్ కు కేసీఆర్ తెచ్చిన ఇబ్బంది…?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇప్పుడు కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కనబడుతున్నాయి. తెలంగాణలో ఉద్యోగుల విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే శాసనసభలో ఉద్యోగులకు ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నెరవేరుస్తూ నిర్ణయం వెల్లడించారు. దీనిపై ఉద్యోగ సంఘాలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. అంతే కాకుండా పదవీ విరమణ వయస్సు విషయంలో కూడా సీఎం కేసీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చారు.
అలాగే పదోన్నతుల విషయంలో కూడా ఆయన నుంచి స్పష్టమైన హామీ వచ్చింది. ఏపీ ఉద్యోగులను రిలీవ్ చేస్తామని కూడా సీఎం కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. దీనితో ఉద్యోగ సంఘాలు అన్నీ కూడా ఇప్పుడు సీఎం కేసీఆర్ కి పాలాభిషేకం చేసే పరిస్థితి ఉంది. తెలంగాణలో ఇప్పటికే అన్ని జిల్లాలో అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో సీఎం కేసీఆర్ కి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు కొన్ని ఇబ్బందులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కి వచ్చే అవకాశాలు ఉండవచ్చు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఉద్యోగుల విషయంలో సీఎం వైఎస్ జగన్ కొన్ని హామీలు అమలు చేసినా… కొన్ని కొన్ని హామీలు విషయంలో ముందడుగు వేయలేకపోతున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు సీఎం జగన్ కి భయపడి ఆయనను కీర్తిస్తున్న పరిస్థితి. కొన్ని కొన్ని హామీలు విషయంలో ఉద్యోగుల అసంతృప్తి ఉంది అనే మాట వాస్తవం. పిఆర్సి విషయంలో అదేవిధంగా సిపిఎస్ రద్దు విషయంలో సీఎం జగన్ ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ ఇప్పటివరకు కూడా హామీలు నెరవేరలేదు. అలాగే పదవీ విరమణ వయస్సు విషయంలో కూడా ఉద్యోగుల నుంచి కొన్ని డిమాండ్లు వస్తున్నాయి.
అలాగే తెలంగాణ ఉద్యోగులు కూడా ముఖ్యమంత్రి జగన్ వద్దకు కొన్ని విజ్ఞప్తులు పెడుతున్నారు. వీటి విషయంలో కూడా సీఎం జగన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తెలంగాణలో ఉద్యోగులకు న్యాయం జరిగింది అనే అభిప్రాయాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కొంతమంది ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి జగన్ త్వరలోనే ఉద్యోగుల విషయంలో ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని లేకపోతే ఉద్యోగ సంఘాల్లో విభేదాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.
ఇప్పటికే రెవెన్యూ ఉద్యోగుల కు కలెక్టర్లకు మధ్య వివాదం నడుస్తుంది. అలాగే విఆర్వో ప్రమోషన్ విషయంలో కూడా విభేదాలు వచ్చాయి. ఈ విషయాలను ముఖ్యమంత్రి జగన్ గమనించి త్వరగా ఈ హామీలను అమలు చేస్తే బాగుంటుంది అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.













