ఆ తూరుపు… ఈ పడమర..
తెలంగాణ గవర్నర్ తమిళిసై-సీఎం కేసీఆర్ మొన్నటి వరకూ ఉప్పు-నిప్పులా ఉండేవారు. గవర్నర్ తమిళిసైని బీజేపీ నాయకురాలిగా బీఆర్ఎస్ నేతలు అభివర్ణిస్తూ వచ్చారు. కొత్త సచివాలయం ప్రారంభోత్సవం సహా అధికారిక కార్యక్రమాలకు వేటికీ ఆమెను ఆహ్వానించలేదు. నాలుగేళ్లుగా ఎట్‌హోం సహా రాజ్‌భవన్ లో జరిగిన కార్యక్రమాలకూ సీఎం, మంత్రులు, బీఆర్ఎస్ నాయకులు హాజరు కాలేదు. ఇంకా చెప్పాలంటే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలనూ గవర్నర్ ప్రసంగం లేకుండానే పూర్తి చేశారు. చివరికి, ఈ అంశం హైకోర్టుకు చేరడం.. కోర్టు బయట పరిష్కరించుకోవాలని న్యాయస్థానం సూచించడంతో గత బడ్జెట్ సమావేశాలకు ఆహ్వానించక తప్పని పరిస్థితి నెలకొంది. అలాగే, పెండింగ్ బిల్లులను గవర్నర్ ఆమోదించడం లేదంటూ రాజ్‌భవన్‌పై సుప్రీం కోర్టునూ తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది. ఇక, గవర్నర్ కూడా అవకాశం చిక్కినప్పుడల్లా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.
అలాంటిది ఒక్కసారిగా వీరిమధ్య వ్యవహారం.. పాలు, నీళ్లలా మారిపోయింది.రాజ్ భవన్, ప్రగతి భవన్ చేతులు కలిపాయి. సచివాలయంలో గుడి, మసీదు, చర్చి ప్రారంభోత్సవంలో సఖ్యత ప్రదర్శించారు. సీఎం కేసీఆర్ గురువారం రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్‌తో ముఖాముఖి భేటీ అయ్యారు. దాదాపు 25 నిమిషాలపాటు ఇరువురూ చర్చించుకున్నారు. మంత్రిగా మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా రాజ్ భవన్ ఇందుకు వేదికైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, మంత్రులకు గవర్నర్ తేనీటి విందు ఇచ్చారు. తర్వాత గవర్నర్‌తో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇప్పటి వరకూ తూర్పు, పడమరగా ఉన్న గవర్నర్, ముఖ్యమంత్రి సమావేశం కావడం.. ముఖ్యమంత్రి రాజ్‌భవన్‌కు వెళ్లడం.. గవర్నర్ కొత్త సచివాలయానికి వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందని, ఇప్పుడు గవర్నర్‌తో సఖ్యతకు కూడా కారణం ఇదేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల వరుసగా జరిగిన పరిణామాలను ఉదాహరిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ తనయ కవిత వ్యవహారం చల్లబడడం.. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తప్పించడం, కమ్యూనిస్టులతో పొత్తును కాలదన్నడం, ఇప్పుడు గవర్నర్‌తో సఖ్యత అన్నీ ఒకదానితో మరొకటి లింకున్న అంశాలేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. నిన్నటి వరకూ తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా చెప్పుకున్న బీజేపీ.. ఇప్పుడు రేసులో లేకుండాపోయింది. ప్రస్తుతం పోరాటం బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యే ఉంది. దీంతో పరిణామాలు ఒక్కసారిగా మారినట్లు సమాచారం.
అయితే ఇది ఎంతవరకూ బీఆర్ఎస్కు ప్లస్ అవుతుందన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది. బీఆర్ఎస్ మాత్రం ఓవైపు బీజేపీతో సఖ్యత ప్రదర్శిస్తూనే, మరోవైపు ఎంఐఎంతో కలిసి సాగుతోంది. అంటే రెండువిధాలుగా తన ప్రయత్నాలు సాగిస్తోంది. ఇప్పటివరకూ బీఆర్ఎస్.. బీజేపీకి బీటీమ్ అంటూ కాంగ్రెస్ ఆరోపించగా..ఇప్పుడా ఆరోపణలకు బలం చేకూర్చినట్లవుతోంది.అయితే వీరిద్దరి కలయిక మాత్రం.. కాంగ్రెస్‌కు ఓవిధంగా ప్లస్ అవుతోంది. దీంతో ఇదే అంశాన్ని మరింత ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. ఎన్నికల రేసులో ముందుకు దూసుకుపోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేసే అవకాశం కనిపిస్తోంది.













