కేసీఆర్… ఈటల… రెండు చోట్ల పోటీ..! తగ్గేదే లే..!!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. దీంతో పార్టీలన్నీ వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి. బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేసింది. ప్రజాక్షేత్రంలో అభ్యర్థులందరూ బిజీబిజీగా ఉంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ మాత్రం ఇంకా టికెట్లు ఖరారు చేయలేదు. అయితే సీనియర్ నేతలందరికీ దాదాపు టికెట్లు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈసారి గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి కూడా బరిలోకి దిగుతుండడంతో ఆయనపై ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తి కలిగిస్తోంది. అయితే గజ్వేల్ లో కేసీఆర్ పై తాను పోటీ చేయబోతున్నట్టు బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రకటించారు.
గజ్వేల్ కేసీఆర్ కంచుకోట. గత రెండు ఎన్నికల్లో ఆయన అక్కడి నుంచే పోటీ చేసి గెలుపొందారు. ఈసారి ఆయన గజ్వేల్ ను వదిలేసి మరో స్థానం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. గజ్వేల్ లో ఓడిపోతాననే భయంతోనే కేసీఆర్ కామారెడ్డి నుంచి కూడా బరిలోకి దిగుతున్నారని బీజేపీ ఎద్దేవా చేసింది. బీఆర్ఎస్ ఓటమికి కేసీఆర్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తుండడమే నిదర్శనమని అభిప్రాయపడింది. కానీ కేసీఆర్ ఏం చేసినా ఎంతో ముందు చూపుతో చేస్తారనే పేరుంది. గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేయడం వెనుక పెద్ద వ్యూహమే ఉంటుందని భావిస్తున్నారు.
అయితే కేసీఆర్ పై తాను పోటీ చేస్తానని గతంలోనే ఈటల రాజేందర్ ప్రకటించారు. ఇప్పటివరకూ బీజేపీ అభ్యర్థులను ఖరారు చేయలేదు. అయినా ఈటల రాజేందర్ మాత్రం గజ్వేల్ తో పాటు హుజూరాబాద్ నుంచి కూడా తాను బరిలో ఉండబోతున్నట్టు తాజాగా వెల్లడించారు. గజ్వేల్ లో కేసీఆర్ పైన తప్పకుండా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తాను పోటీ చేస్తే ఓడిపోతానని భావించే కేసీఆర్.. గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో కూడా కేసీఆర్ పోటీ చేయబోతున్నట్టు తెలిపారు ఈటల. తనను నమ్మి ఓటేసిన హుజూరాబాద్ లో కూడా మళ్లీ బరిలో ఉంటానన్నారు. అయితే గజ్వేల్ లో ఈటల రాజేందర్, హూజూరాబాద్ లో ఆయన భార్య జమున పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఈటల ప్రకటనతో జమున పోటీ చేయడం లేదని తెలుస్తోంది.
ఓటమి భయంతోనే కేసీఆర్ పోటీ చేస్తున్నారని బీజేపీ గతంలో విమర్శించింది. ఈటల రాజేందర్ కూడా ఇప్పుడు రెండు స్థానాల్లో పోటీ చేస్తాననడంపై బీఆర్ఎస్ నేతలు కూడా అదే స్థాయిలో కౌంటర్స్ ఇస్తున్నారు. హుజూరాబాద్ లో ఓడిపోతాననే భయంతోనే గజ్వేల్ లో కూడా పోటీ చేస్తున్నావా అని ప్రశ్నించారు. గజ్వేల్ లో కేసీఆర్ చేతిలో ఓడిపోవడం ఖాయమని.. అక్కడ గులాబి దళపతిని ఓడించడం అసాధ్యమని చెప్తున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు ఇప్పుడు నేరుగా ఎన్నికల్లో పోటీ పడబోతున్నారు.













