కర్నాటక మోడల్ పనికొస్తుందా?..
కర్నాటకలో పార్టీ గెలుపు తెలంగాణ కాంగ్రెస్‌కు బూస్ట్ ఇచ్చినట్లే కనిపిస్తోంది. పార్టీ కేడర్‌లో నూతనోత్సాహం ఉరకలేస్తోంది. కర్నాటక విజయం దేశవ్యాప్తంగా ప్రభావం చూపిస్తుందని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అక్కడి ప్రజల జీవన విధానం, ఆలోచన సరళి.. ఇక్కడి ప్రజల్ని పోలి ఉంటారన్నారు. కర్నాటక ఎన్నికల ఫలితాలే తెలంగాణలోనూ పునరావృతం కానున్నాయని జోస్యం చెప్పారు
కర్నాటకలో ఉన్నట్లే తెలంగాణలోనూ కాంగ్రెస్‌కు బలమైన కేడర్ , లీడర్లు ఉన్నారు. అయితే అక్కడ అందరూ ఏకతాటిపైకి వచ్చి పోరాడారు. ఓవైపు కర్నాటక పీసీసీ చీఫ్ డికె శివకుమార్ లాంటి నేతల్ని .. దర్యాప్తు బృందాలు దాడులతో వేధించినా ధైర్యంగా పోరాడారు. అంతే కాదు.. పార్టీకి డైనమిక్ లీడర్‌గా నిలిచారు. మరోవైపు సిద్ధరామయ్య.. తన అపార అనుభవాన్ని రంగరించి, పార్టీ ఓటుబ్యాంకు చెదరకుండా రక్షించుకోగలిగారు. ఈ ఇరువురు నేతలు ప్రజల నమ్మకాన్ని చూరగొనగలగడంతో భారీ విజయాన్ని సాధించగలిగారు.
మరి తెలంగాణలో ఆపరిస్థితి ఉందా అంటే గట్టిగా అవుననే పరిస్థితి లేదు. బలమైన కేడర్ ఉంది, లీడర్లు ఉన్నారు. అయితే అనైక్యత ఆపార్టీకి శాపంలా మారింది. టీ పీసీసీ చీఫ్ రేవంత్.. ఓవైపు భారత్ జోడో యాత్రలతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలకు వెళ్తున్నారు. కానీ.. కొన్ని జిల్లాల్లో సీనియర్లు.. తమ ఆధిపత్యంకోసం ప్రయత్నిస్తున్నారు. ఫలితంగా పీసీసీ చీఫ్ తన యాత్ర రూట్‌మ్యాప్‌ను సవరించుకోవాల్సిన దుస్థితి దాపురించింది. ఇక కోమటిరెడ్డి లాంటి కొందరు నేతలు ఇష్టానుసారం మాట్లాడినా వారిపై చర్యలుండవు. హైకమాండ్‌కు అందరూ తమ అభిప్రాయాలు పంపుతారు. కానీ.. తర్వాత పెద్దలను కలిసి వచ్చి, అంతా బానే ఉందని కలరింగిస్తారు. అదేమంటే కాంగ్రెస్‌లో అంతే అనే సమాధానం వినవస్తుంది.
మరోవైపు కోవర్టుల బెడద కాంగ్రెస్‌ను తీవ్రంగా వేధిస్తోంది. మునుగోడు ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డే మీడియా ముఖంగా .. కోవర్టులు పార్టీని వీడి వెళ్లాలన్నారు. అంటే… పార్టీలో గులాబీ కోవర్టులున్నట్లు ఆ పార్టీనేతలే అంగీకరించిన పరిస్థితులున్నాయి. ఇక చాలా మంది కాంగ్రెస్ నేతలు.. తమతో టచ్‌లో ఉన్నట్లు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. దీంతో కాంగ్రెస్ పరిస్థితి ఒకడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్నట్లుంది.
నేతల్లో అనైక్యత, కోవర్టుల బెడద లాంటి దుర్లక్షణాల్ని వదిలించుకుని కాంగ్రెస్ విజయం వైపు పరుగులు తీయాల్సి ఉంటుంది. మరి అందుకు హైకమాండ్ ఏం చేస్తుంది? కర్ణాటక తర్వాత తెలంగాణపై అధికఫోకస్ పెడుతున్న కాంగ్రెస్ హైకమాండ్.. ఎలాంటి ప్రణాళికలు వేయనుంది? ఇంతకూ కర్ణాటక మోడల్.. తెలంగాణలో పనిచేస్తుందా? నేతలందరూ విభేదాలు వీడి ఏకతాటిపైకి వస్తారా? ఇప్పుడిదే అంశంపై..తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.













