తెలంగాణలో కర్నాటక డ్రగ్స్ కేసు ప్రకంపనలు!
టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. గతంలో హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ కేసు సుదీర్ఘకాలం పాటు నడిచింది. అయితే ఈసారి మాత్రం ఇది బెంగళూరుకు మారింది. ఎక్కడో ముంబైలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసు విచారణలో వెలుగు చూసిన అంశాలు.. ఇప్పుడు శాండల్ వుడ్ నుంచి టాలీవుడ్ వరకూ విస్తరించాయి. దీనిపై లోతైన దర్యాప్తు చేస్తున్న బెంగళూరు పోలీసులు.. పలువురు టాలీవుడ్ తారలు, తెలంగాణ రాజకీయ నేతల ప్రమేయం కూడా ఉన్నట్టు తేల్చారు.
కర్నాటకలో డ్రగ్స్ కేసు విచారణ వేగవంతమైంది. తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు ప్రముఖుల పేర్లు ఇందులో ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, 8 మంది ఈవెంట్ మేనేజర్ల పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఓ హీరోను, వ్యాపారవేత్త సందీప్‌రెడ్డిని పోలీసులు విచారించారు. ఈవెంట్ మేనేజర్ కలహరిరెడ్డి, రతన్రెడ్డిలకు నోటీసులు జారీ చేశారు. సందీప్ రెడ్డి, హీరో ఇచ్చిన స్టేట్మెంట్తో 4 కేసులను నమోదు చేశారు బెంగళూరు పోలీసులు.
డ్రగ్స్ కేసులో సందీప్ రెడ్డి అప్రూవర్‌గా మారినట్లు తెలుస్తోంది. పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో డ్రగ్స్ తీసుకున్నట్టు సందీప్ రెడ్డి అంగీకరించాడు. నిర్మాత శంకర్‌గౌడ్ ఇచ్చిన పార్టీకి కలహరి రెడ్డి, రతన్ రెడ్డి, శ్రీను రెడ్డి, హీరోతో పాటు కలిసి తాను పాల్గొన్నట్టు సందీప్ రెడ్డి పోలీసులకు తెలిపాడు. మూడు రోజుల పాటు తాము ఎంజాయ్ చేశామన్నాడు. హైదరాబాద్ తిరిగి వెళ్లే సమయంలో రతన్ రెడ్డి, శంకర్ గౌడ్ నుంచి కోకెైన్ తీసుకొని వచ్చినట్టు సందీప్ తెలిపాడు. అంతేగాకుండా నగరంలోని పలు పబ్‌ల్లో జరుగుతున్న డ్రగ్స్ దందాపై కూడా సందీప్ సమాచారం ఇచ్చారని తెలుస్తోంది.
కర్నాటకలో జరిగిన డ్రగ్స్ పార్టీలో ఓ ఎమ్మెల్యే కూడా పాల్గొన్నాడని పోలీసులు తెలిపారు. ఆ ఎమ్మెల్యే అమ్మాయిలతో కలిసి చిందులు వేసినట్టు గుర్తించారు. దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ కూడా పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికి రెండు సార్లు నోటీసులు ఇచ్చినా కలహర్ రెడ్డి, రతన్ రెడ్డి పోలీసుల ఎదుట హాజరుకాలేదు. ఈదఫా నోటీసులకు స్పందించకపోతే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మరి వీళ్లను కూడా విచారిస్తే ఇంకెంతమంది పేర్లు బయటికొస్తాయోనని తెలంగాణకు చెందిన రాజకీయ నేతలు, టాలీవుడ్ తారలు తలలు పట్టుకుంటున్నారు.













