తెలంగాణ హైకోర్టుకు తొలి మహిళా న్యాయమూర్తి
తెలంగాణ హైకోర్టుకు అలహాబాద్ హైకోర్టు అదనపు న్యాయమూర్తి జస్టిస్ గండికోట శ్రీదేవి బదిలీపై రానున్నారు. ఆమె ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందినవారు. తనను తెలంగాణ హైకోర్టు బదిలీ చేయాలని కోరుతూ ఈ ఏడాది ఫిబ్రవరి 18న ఆమె సుప్రీంకోర్టు కొలీజియంకు విజ్ఞప్తి చేసుకున్నారు. సీజేఐ రంజన్ గోగోయ్ నేతృత్వంలోని కొలీజియం ఆమె విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని, తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్రానికి సిఫారసు చేసింది. జస్టిస్ శ్రీదేవి 2005లో ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ జిల్లా అదనపు / సెషన్స్ జడ్జిగా నియమితులయ్యారు. 2008, 2009లో ఝాన్సీలోని ఫ్యామిలీ కోర్టు ప్రధాన జడ్జిగా పనిచేశారు. అలహాబాద్ హైకోర్టు అదనపు జడ్జిగా పదోన్నతి పొందేముందు సీబీఐ ప్రత్యేక కోర్టు, ఎస్సీ, ఎస్టీ, నిత్యావసర వస్తువుల చట్టాల ప్రత్యేక కోర్టు జడ్జిగా పనిచేశారు. నిరుడు నవంబరు 22న అలహాబాద్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.













