ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ దూరం..! ఏంటి సంగతి..?
ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ అట్టహాసంగా నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాలలో ఎన్టీఆర్ స్ఫూర్తిన చాటేలా కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా ఇవాళ హైదరాబాద్ లో కూడా గ్రాండ్ గా శతజయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం సినీరంగానికి పలువురు ప్రముఖులతో పాటు కుటుంబ సభ్యులందరినీ వేడుకలకు ఆహ్వానించింది. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లను స్వయంగా ఇంటికెళ్లి ఆహ్వానించారు కమిటీ కన్వీనర్ టీడీ జనార్ధన్. అయితే ఈ వేడుకలకు తాను రావట్లేదని ప్రకటించారు జూనియర్ ఎన్టీఆర్.
జూనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి, నారా – నందమూరి కుటుంబాలకు మధ్య గ్యాప్ ఉందనే విషయం తెలిసిందే. ముఖ్యంగా నందమూరి హరికృష్ణ చనిపోయిన తర్వాత ఆ రెండు కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్. అన్నదమ్ములిద్దరూ కలసిమెలసి సాగుతున్నారు. ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో తప్ప కుటుంబ సభ్యులతో కలసిన దాఖలాలు లేవు. తారకరత్న మరణించిన సమయంలో అలా వెళ్లి ఇలా వచ్చారు. అంతేకానీ ఇంతకుముందు లాగా కుటుంబసభ్యులందరూ కలిసి మెలిసి ఉన్న సందర్భాలు లేవు. ఈ గ్యాప్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గట్లేదు.
జూనియర్ ఎన్టీఆర్ ను తెలుగుదేశం పార్టీ దూరం పెడుతోందని ఆయన అభిమానులు ఫైర్ అవుతున్నారు. కుప్పంలో చంద్రబాబు పర్యటించినప్పుడు, లోకేశ్ పాదయాత్ర సమయంలో పలువురు జూనియర్ అభిమానులు ఆయన్ను పార్టీలో యాక్టివ్ చేయాలని సూచించారు. అయితే తెలుగుదేశం పార్టీ అందరిదీ అని.. ఎవరైనా రావచ్చని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. పైగా జూనియర్ తో తమకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పే ప్రయత్నం చేశారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కు లోకేశ్ కూడా బర్త్ డే విషెస్ చెప్పారు. అయిపై ఇవన్నీ పైపైనే. లోపల మాత్రం గ్యాప్ చాలానే ఉంది. ఆ మధ్య ఎన్టీఆర్ పుట్టిన నిమ్మకూరులో ఎన్టీఆర్ జయంతి వేడుకలకు కుటుంబసభ్యులందరినీ ఆహ్వానించారు కానీ జూనియర్ ఎన్టీఆర్ ను పిలవలేదు. ఇది విమర్శలకు దారితీసింది.
అందుకే ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతున్న ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు కుటుంబసభ్యులందరినీ ఆహ్వానించింది. శతజయంతి వేడుకల కమిటీ కన్వీనర్ టీడీ జనార్ధన్ స్వయంగా జూనియర్, కల్యాణ్ రామ్ ఇళ్లకు వెళ్లి ఆహ్వానించారు. ఇవాళ వేడుకల ప్రాంగణానికి దారితీసే రోడ్లలో భారీగా కటౌట్లు ఏర్పాటు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ తప్పకుండా వస్తారని ఆశించారు. అయితే తాను వేడుకలకు హాజరు కాలేకపోతున్నానని జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించారు. ఇవాళ తన పుట్టిన రోజు అని, ముందుగానే కుటుంబసభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నానని తెలిపారు. అందుకే హాజరు కాలేకపోతున్నానని.. ఈ విషయాన్ని తనకు ఆహ్వానం అందించిన సమయంలోనే కమిటీకి తెలియజేశానని చెప్పారు. దీంతో ఈ వివాదానికి బ్రేక్ పడింది. అయితే గ్యాప్ మాత్రం కంటిన్యూ అవుతున్నట్టు మరోసారి నిర్దారణ అయింది.













