ఈ 5 ఏళ్లు రేవంత్ రెడ్డే సీఎం.. స్పష్టం చేసిన జగ్గారెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐదేళ్ల పాటు సీఎంగా కొనసాగే అవకాశం లేదంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఖండించారు. రాష్ట్రంలో ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోందని, ఇలాంటి టైంలో ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికే ప్రతిపక్షాలు ఇలా సీఎంల పంచాయతీని తెరమీదకు తెస్తున్నాయని ఆరోపించారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా మహేశ్వర్ రెడ్డికి మాట్లాడే హక్కుందని, కానీ ఇటువంటి అసత్యాలను, అబద్దాలను ప్రచారం చేయడం మానుకోవాలని హితవుపలికారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణలో ఈ ఐదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని, అందులో ఎలాంటి అనుమానం లేదని చెప్పిన జగ్గారెడ్డి.. ఈ ఐదేళ్లు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఆయనను డిస్టర్బ్ చేసే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ నాయకులెవరూ లేరని వివరించారు.
అనంతరం రాష్ట్రంలో రకరకాల ట్యాక్స్ వసూళ్లకు కాంగ్రెస్ పాల్పడుతోందంటూ ఏలేటి చేసిన వ్యాఖ్యలకు కూడా జగ్గారెడ్డి జవాబిచ్చారు. రకరకాల ట్యాక్స్‌ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వంపై, నాయకులపై మీడియా ముందు ఆరోపణలు చేయడం కాదని, ఆధారాలుంటే మీడియాకు చూపించాలని డిమాండ్ చేశారు. వైట్ పేపర్ లాంటి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి కావాలనే బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.