కేసీఆర్ వీటి మీద ఫోకస్ చేయకపోతే కష్టమే…?
తెలంగాణలో ఇప్పుడు కొన్ని కొన్ని సంక్షేమ కార్యక్రమాల విషయంలో సీఎం కేసీఆర్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రధానంగా పెన్షన్లు అలాగే నిరుద్యోగ భృతి విషయంలో సీఎం కేసీఆర్ ఆలోచన మారాల్సిన అవసరం ఉందనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం చాలా వరకు కూడా బలంగానే ఉంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆర్థిక వనరులు కూడా కాస్త ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి సీఎం కేసీఆర్ జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.
కొన్ని కొన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉన్న తరుణంలో కూడా సీఎం కేసీఆర్ తప్పులు ఎక్కువగా చేస్తున్నారు అనే భావన వ్యక్తమవుతోంది. రాజకీయంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ లో సీఎం కేసీఆర్ ను పార్టీపరంగా వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేస్తూ వస్తుంది. సీఎం కేసీఆర్ గతంలో ఎన్నో హామీలు ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పటివరకు చాలా హామీలు అమలు అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రతి అంశాన్ని కూడా టార్గెట్ చేస్తూ ముందుకు వెళుతుంది.
అందుకే ఇప్పుడు సీఎం కేసీఆర్ నిరుద్యోగ భృతిని అమలు చేయాల్సిన అవసరం వచ్చింది అనే భావన ఎక్కువగా ఉంది. భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో నైనా సరే అడుగుపెడితే యువతను ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సీఎం కేసీఆర్ వాళ్ళను దగ్గర చేసుకునే విధంగా ప్రత్యేకంగా ముందుకు వెళ్ళాలి. అందుకే నిరుద్యోగ భృతి ఎంత త్వరగా ప్రవేశ పెడితే అంత మంచిది అనే భావన కూడా ఉంది. ఉద్యోగ నియామకాల విషయంలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తర్వాత సీఎం కేసీఆర్ అడుగులు వేయకపోతే మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు ఉంటాయి.
అలాగే ఆసరా పెన్షన్లు కొత్తగా నమోదు కావడం లేదు అనే ఆవేదన కూడా కొన్ని కొన్ని జిల్లాల్లో వ్యక్తమవుతుంది. ప్రధానంగా వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అనుకూలంగా ఉన్న వాళ్లకు మాత్రమే కొన్ని సంక్షేమ కార్యక్రమాలు వస్తున్నాయి. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని కొందరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి సీఎం కేసీఆర్ వీటన్నింటి మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గనుక రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలతో విపక్షాలు ఇబ్బంది పెట్టలేదు అంటే మాత్రం కచ్చితంగా సీఎం కేసీఆర్ రాజకీయంగా చాలా నష్టపోయే అవకాశాలు ఉంటాయి.













