హంగ్ ఆశల్లో… కింగ్ మేకర్లు…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ దే పైచేయి అని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. మరికొన్ని మాత్రం హంగ్ వచ్చే అవకాశం ఉందంటున్నాయి. అయితే ఇప్పుడు హంగ్ వస్తే పరిస్థితి ఏంటి..? కింగ్ మేకర్లెవరు..? ఏయే పార్టీల దశ తిరుగుతుంది. నిజంగా కింగ్ మేకర్లుగా మారితే.. వారి డిమాండ్లు ఎలా ఉండే అవకాశముంది. అప్పుడు ఏర్పడబోయే సర్కార్.. తోలుబొమ్మలా మారే ప్రమాదముందా..? ఇప్పుడీ అంశాలను పరిశీలిద్దాం..
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు మ్యాజిక్ ఫిగర్ రాకుంటే.. అప్పుడు కింగ్ మేకర్లకు పెద్ద ఛాన్సే అని చెప్పొచ్చు. అందులో ముఖ్యమైంది ఎంఐఎం.,. ఎందుకంటే పాతబస్తీ పార్టీకి ఏడు సీట్లు దక్కే అవకాశముందంటున్నారు. అదే జరిగితే.. ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే.. ఈపార్టీయే దిక్కుగా మారనుంది. ఇప్పటికే ఆపార్టీ నేత అక్బరుద్దీన్.. రెడ్డిలైనా, రావులైనా స్టీరింగ్ మాదే అంటూ పలుమార్లు బాహటంగా ప్రకటించారు. ఇప్పుడు అదే నిజమయ్యే పరిస్థితి ఉంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి.. ఎంఐఎం బీఆర్ఎస్ వైపే నిలబడే అవకాశం ఉంది. బీఆర్ఎస్ కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఐదారు సీట్లు తగ్గిన పక్షంలో ఎంఐఎం అటు మొగ్గే అవకాశం ఉంది! అలా అని కాంగ్రెస్ కు దూరంగా ఉంటుందా.. అదీ కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే మొదటి నుంచి కాంగ్రెస్ నేతలతో ఎంఐఎంకు సత్సంబంధాలే ఉన్నాయి.
అదే అవకాశం బీజేపీకి కూడా ఉంది! బీజేపీ నేతలు తమకు ఏకంగా టెన్ ప్లస్ సీట్లు వస్తాయన్న ఆశల్లో ఉన్నారు. కనీసం ఓ ఏడెనిమిది సీట్లు వచ్చినా..వారు కింగ్ మేకర్లుగా మారే ఛాన్సుంది. అయితే ఇదే జరిగితే చాలా ఆసక్తికర పరిణామాలను చూడొచ్చు. గతంలో మిత్రులుగా వ్యవహరించి, తర్వాత బద్ధశత్రువులుగా మారిన బీఆర్ఎస్, బీజేపీలు .. కలసి సర్కార్ ఏర్పాటు చేసే అవకాశముంది. ఎందుకంటే ఇటీవల కొందరు బీజేపీ నేతలు కాంగ్రెస్ కన్నా.. బీఆర్ఎస్ మిన్న అన్న కామెంట్లు కూడా చేశారు.
అయితే తెలంగాణ అభివృద్ధి పథంలో సాగాలంటే ఏదో ఓ పార్టీకి పూర్తిస్థాయి ఆధిక్యం రావాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ప్రభుత్వం.. తాను ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా సాధ్యమవుతుంది. లేదంటే .. కీలుబొమ్మ సర్కార్ పాలనతో..రాష్ట్రం ఇబ్బందిపడాల్సి ఉంటుంది.













