గులాబీకి గుబులు పుట్టిస్తున్న ఇండియా టుడే సర్వే..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. డిసెంబర్ లో జరిగే ఈ ఎన్నికలకోసం పార్టీలన్నీ కత్తులు తీసి సాన పెట్టుకుంటున్నాయి. అధికార బీఆర్ఎస్ అందరికంటే ముందుగా యుద్ధభేరి మోగించింది. 115 స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించేసింది. ఇక మిగిలింది నాలుగు స్థానాలే. మళ్లీ తమదే అధికారం అని ఆ పార్టీ ధీమాగా ఉంది. అయితే ఇటీవల ఇండియా టుడే వెల్లడించిన సర్వేలో ఆ పార్టీ వెనుకబడి ఉందని తేలింది. ఇది గులాబీ పార్టీకి గుబులు పుట్టిస్తోంది. తమదే అధికారం అని నమ్మకంగా ఉంటున్న సమయంలో ఈ సర్వే ఇలా చెప్పిందేంటి అని ఆ పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.
వచ్చే ఏడాది మేలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పలు మీడియా సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట ఇండియా టుడే ఎప్పటికప్పుడు సర్వే నిర్వహిస్తూ ఉంటుంది. ఇటీవల ఇండియా టుడే అలాంటి సర్వే ఒకటి నిర్వహించింది. ఇందులో ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య ఈసారి హోరాహోరీ పోరు ఉంటుందని తేల్చింది. ఇండియా కూటమికే కాస్త మొగ్గు ఉంటుందని అంచనా వేసింది. అలాగే తెలంగాణ, ఏపీలో కూడా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది వెల్లడించింది ఇండియా టుడే.
లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు 5 సీట్లు మాత్రమే వస్తాయని ఇండియా టుడే సర్వే తేల్చింది. అందరికంటే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి 7 సీట్లు వస్తాయని తెలిపింది. బీజేపీకి 4, మజ్లిస్ పార్టీకీ 1 సీటు దక్కుతాయని అంచనా వేసింది. తెలంగాణలో బీఆర్ఎస్ – కాంగ్రెస్ పార్టీ మధ్య హోరాహోరీ పోరు తప్పదని .. కాంగ్రెస్ పార్టీకే కాస్త మొగ్గు ఉంటుందని తేల్చేసింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 41.71శాతం ఓట్లు లభించాయి. అయితే ఈసారి గతంలో కంటే దాదాపు 10శాతం ఓట్లు తగ్గుతాయని అంచనా వేసింది. ఆ ఓట్లన్నీ దాదాపు కాంగ్రెస్ పార్టీకి బదిలీ అవుతాయని వెల్లడించింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 29శాతం ఓట్లు రాగా.. ఈసారి 38శాతం ఓట్లు వస్తాయని తేల్చింది.
ఇండియా టుడే సర్వే ఇప్పుడు గులాబి శ్రేణులను కలవరపెడుతోంది. దాదాపు పదేళ్లుగా రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్, బీజేపీలకు ఇక్కడ బలమైన నేతలు లేకపోవడంతో కచ్చితంగా తమకే అధికారం దక్కుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. పైగా ఆ పార్టీలకంటే తాము మెరుగైన పాలన అందించామని.. తెలంగాణ తీసుకురావడమే కాక.. రూపురేఖలను సమూలంగా మార్చేశామని ఆయన చెప్పుకుంటున్నారు. అయినా ఇండియా టుడే సర్వేలో ఇలాంటి ఫలితారు రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ఇండియా కూటమికి అనుకూలంగా ఇచ్చిన సర్వే అని.. తమ సర్వేల్లో మళ్లీ తమదే ఘన విజయం అని తేలిందని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. మరి రిజల్స్ట్ ఎలా ఉంటాయో ఎన్నికల వరకూ వేచి చూడాల్సిందే.













