ఐఏఎంసీని ప్రారంభించిన సీజేఐ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్
దేశంలో మొదటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం (ఐఏఎంసీ) హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. నానక్‌రాంగూడ ఫొనిక్స్ వీకే టవర్‌లో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఐఏఎంసీ వెబ్సైట్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రాంగణాన్ని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు కేసీఆర్ అప్పగించారు. అనంతరం ఇద్దరూ కలిసి ఐఏఎంసీలో వసతులు, ఏర్పాట్లను పరిశీలించారు. ప్రస్తుతం తాత్కాలిక భవనంలో ఏర్పాటవుతున్న ఈ కేంద్రానికి శాశ్వత భవనం కోసం భూకేటాయింపులు కూడా పూర్తయ్యాయి.
ఈ కార్యక్రమంలో ట్రస్టీలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వర రావు, జస్టిస్ హిమాకోహ్లి, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, హోంమంత్రి మహమూద్ అలీ, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.













