హైడ్రా దూకుడు కొనసాగేనా…?

ప్రముఖ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ భవనాలను కూలగొట్టడం ద్వారా .. తాను మాటల మనిషిని కాదు చేతల మనిషిని అని సీఎం రేవంత్ రెడ్డి నిరూపించుకున్నారు. గత ప్రభుత్వాలు .. ఈ ఎన్ కన్వెన్షన్ కు నోటీసులిచ్చి, తర్వాత చూసిచూడనట్లు వదిలేశాయి. అయితే విపక్షంలో ఉన్నప్పుడు ఎన్ కన్వెన్షన్ గురించి ప్రస్తావించిన రేవంత్.. సీఎం అయిన కొద్దినెలల్లోనే కూలగొట్టేశారు. చెరువు గర్భంలో కట్టేశారని.. అందుకే కూలగొట్టామన్నారు డిప్యూటీ సీఎం. ప్రస్తుతం దీనిపై పెద్దగా వివాదం లేదు.
ఇది ఇక్కడితో అయిపోలేదు.. ఇప్పుడే అసలు కథ మొదలైంది..నాగార్జున మాత్రమే అక్రమ కట్టడాలు కట్టారా అంటే.. చాలా మంది ప్రముఖులు.. ఈబఫర్ జోన్ లో భవనాలు, ఫామ్ హౌస్ లు నిర్మించుకున్నారు. ఇప్పుడు వీటన్నింటినీ ఈ సర్కార్ కూలగొట్టగలదా.. ఇప్పుడు అందరిలోనూ ఇదే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరీ ముఖ్యంగా కేటీఆర్… జన్వాడ ఫామ్ హౌస్ ఎందుకు కూల్చడం లేదని బీజేపీనేతలు ప్రశ్నిస్తున్నారు. ఆఫామ్ హౌస్ ముట్టుకోవాలంటే రేవంత్ ఎందుకు భయపడుతున్నాడని నిలదీస్తున్నారు.
అంతేకాదు అక్కడ .. కాంగ్రెస్ నేతల ఫామ్ హౌస్ లు ఉన్నాయన్నారు. వీటన్నింటినీ కూలగొట్టాలన్నారు. ఇప్పుడు వీటిలో ఎన్ని కూలగొట్టగలరు. అన్నింటినీ టచ్ చేయగలరా..? రాబోయే రాజకీయ ఒత్తిడులను తట్టుకునే పరిస్థితి ఉందా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ మాత్రం.. రాష్ట్రంలో చెరువులను కాపాడేందుకు స్వచ్చందసంస్థలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఎక్కడ ఫిర్యాదులొస్తే.. అక్కడి అధికారులు వాటిని కూలగొడతారన్నారు. ఇక వీటిని కూలగొట్టేస్తామంటే .. అంత ఈజీగా జరిగేలా కనిపించడం లేదు.
నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిన తర్వాత హైకోర్టు నుంచి స్టే వచ్చింది. పూర్తిగా విచారణ జరపకుండా యాక్షన వద్దంది. ఈపరిణామంతో మిగిలిన వారు కోర్టును ఆశ్రయిస్తారనడంలో సందేహం లేదు. మరి అలాంటప్పుడు న్యాయ స్థానాల ఆదేశాలు లేకుండా ముందుకెళ్లే పరిస్థితి ఉండదు. మరి అలాంటప్పుడు రేవంత్ సర్కార్ ఎలా ముందడుగు వేయనుందన్నది వేచి చూడాలి.