హైదరాబాద్‌తో ఆంధ్రప్రదేశ్ బంధానికి చెల్లు!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు పదేళ్లు పూర్తి కావస్తోంది. విభజన సమయంలో విభజిత ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేకుండా పోవడంతో హైదరాబాద్ నే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించింది విభజన చట్టం. జూన్ 2తో పదేళ్లు కావస్తుండడంతో ఉమ్మడి రాజధాని అంశం కూడా కనుమరుగు కానుంది. హైదరాబాద్ తో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా తెగదెంపులు చేసుకునేందుకు సమయం దగ్గర పడింది. అయితే పదేళ్లు పూర్తి కావస్తున్నా ఏపీకి రాజధాని ఏది అనే అంశంపై ఇప్పటికీ ఊగిసలాట కొనసాగుతోంది.
దశాబ్దాల పోరాటం అనంతరం 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టడాన్ని సీమాంధ్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా తెలంగాణ ఇచ్చేందుకే అప్పటి యూపీఏ ప్రభుత్వం మొగ్గు చూపడంతో హైదరాబాద్ పై సీమాంధ్రులు గట్టిగా పట్టుబట్టారు. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. వాళ్ల కోరిక మేరకు హైదరాబాద్ ను పదేళ్లపాటు .. అంటే 2024 జూన్ 2 వరకూ అటు ఏపీ, ఇటు తెలంగాణల ఉమ్మడి రాజధానిగా ప్రకటిస్తూ విభజన చట్టం చేశారు.
హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ కు పలు కార్యాలయాలను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. పదేళ్లపాటు వీటిపై ఏపీకి కూడా హక్కుంటుంది. సెక్రటేరియేట్, అసెంబ్లీ సహా ఆర్టీసీ, విద్యుత్, జలమండలి లాంటి ఆఫీసుల్లో ఏపీకి కూడా వాటా ఉంది. ఏపీలో రాజధాని అందుబాటులోకి వచ్చేంత వరకూ ఇక్కడి నుంచే పాలన కొనసాగించుకునేలా చట్టంలో పొందు పరిచారు. పదేళ్లలోపు ఏపీలో రాజధానిని పూర్తి చేసేందుకు కేంద్రం తగిన సాయం చేసేలా కూడా హామీ ఇచ్చారు.
2014లో ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం కొంతకాలానికే అమరావతిని రాజధానిగా ప్రకటించింది. అక్కడ తాత్కాలిక సచివాలయాన్ని ఏర్పాటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి మెజారిటీ కార్యాలయాలన్నింటినీ అమరావతి, విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాలకు తరలించేసింది. అయినా హైదరాబాద్ లో ఏపీకి కేటాయించిన భవనాలను మాత్రం తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించలేదు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం హైదరాబాద్ లోని కార్యాలయాలను తెలంగాణకు అప్పగించేసింది. పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానే అయినా అనధికారికంగా హైదరాబాద్ నుంచి ఏపీ ఎప్పుడో వెళ్లిపోయింది.
అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని టీడీపీ భావిస్తే.. వైసీపీ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ చేసుకుంది. అయితే దీనిపైన న్యాయపరమైన చిక్కులు రావడంతో ఆ ప్రతిపాదనను విరమించుకుంది. దీంతో ఇప్పటికైతే అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంది. అయితే ఈసారి వైసీపీ అధికారంలోకి వస్తే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. టీడీపీ వస్తే అమరావతిని అభివృద్ధి చేయనుంది.
హైదరాబాద్ పై పదేళ్లపాటు హక్కులు ఉన్నా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన కొన్నాళ్లకే తట్టాబుట్టా సర్దేసుకుని వెళ్లిపోయింది. అయినా విభజన చట్టం ప్రకారం జూన్ 2 వరకూ హైదరాబాద్ ఉమ్మడి రాజధానే. ఇప్పుడు సమయం దగ్గర పడడంతో ఉమ్మడి రాజధానికి కాలం చెల్లనుంది. జూన్ 2 తర్వాత ఏపీ, తెలంగాణ మధ్య హైదరాబాద్ అంశం పూర్తిగా తెరమరుగు కానుంది. అయినా ఇప్పటికీ విభజన చట్టంలోని పలు అంశాలు రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగానే ఉన్నాయి. వీటిని పరిష్కరించాలని అటు ఏపీ, ఇటు తెలంగాణ కేంద్రాన్ని కోరుతున్నాయి. అయితే రెండు రాష్ట్రాల మధ్య పలు అంశాలపై పీఠముడి పడడంతో కేంద్రం చేతులెత్తేస్తోంది.