రెండో దశ వ్యాప్తి చెందాక మేల్కొంటారా? హైకోర్టు
తెలంగాణలోని కరోనా పరిస్థితులపై హైకోర్టు మళ్లీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా రెండో దశ వ్యాప్తి చెందాక మేల్కొంటారా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. రెండో వేవ్ పొంచి వున్నా ఎందుకు సంసిద్ధం కాలేదని నిలదీసింది. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ హాజరయ్యారు. నైట్ కర్ఫ్యూ వల్ల కరోనా కేసులు తగ్గాయని ప్రభుత్వం పేర్కొనగా, ఎక్కడ తగ్గాయో చూపించాలని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. బార్లు, థియేటర్ల వద్ద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని, కుంభమేళాకు వెళ్లొచ్చిన వారిని ఇతర రాష్ట్రాలు క్వారంటైన్లో పెడుతున్నాయని, తెలంగాణలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని హైకోర్టు వివరణ కోరింది. వీఐపీలకు మాత్రమే 24 గంటల్లో రిపోర్ట్ ఇస్తున్నారని, మిగితా వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షల రిపోర్టును 24 గంటల్లోగా ఎందుకు ఇవ్వట్లేదని సూటిగా ప్రశ్నించింది.
శ్మశాన వాటికల్లో రోజుకు ఎంత మందికి అంత్యక్రియలు చేస్తున్నారో వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కోవిడ్ సెంటర్లను ఏర్పాటు చేశారు? వలస కార్మికు కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారు? 108 అంబులెన్స్‌లు రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి? అంటూ ప్రభుత్వంపై హైకోర్టు ప్రశ్నల పరంపరను సంధించింది. పెళ్లిళ్లు, అంత్యక్రియలకు ఆంక్షలున్నప్పుడు… ఎన్నికలు అతీతమా? అంటూ హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఎన్నికల ర్యాలీలపై ఎందుకు ఆంక్షలు విధించడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. సీఎం కేసీఆర్‌తో సహా అధికారులు కోవిడ్ బారిన పడ్డారని, అయినా రాష్ట్రంలో చర్యలు శూన్యమని హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.













