తెలంగాణలో లాక్డౌన్ లేదా కర్ఫ్యూ..! 48 గంటల డెడ్ లైన్
తెలంగాణలో కూడా లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ తప్పేలా లేదు. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కఠిన ఆంక్షలు తీసుకోవాలంటూ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. లాక్ డౌన్ విధిస్తారో.. కర్ఫ్యూ పెడతారో 48 గంటల్లో చెప్పాలంటూ డెడ్ లైన్ విధించింది. లేకుంటే తామే ఆదేశాలిస్తామని స్పష్టం చేసింది.
తెలంగాణలో కరోనా వ్యాప్తి, నివారణ చర్యలపై హైకోర్టులో ఇవాళ వాడివేడి వాగ్వాదాలు జరిగాయి. ఉదయం ఓ సారి కరోనాపై వాదనలు జరిగాయి. అయితే ప్రభుత్వ వివరణతో సంతృప్తి చెందని హైకోర్టు.. మధ్యాహ్నం మరోసారి సమావేశమవుదామని.. ఆలోపు వివరాలు అందించాలని ఆదేశించింది. అంతేకాక.. సంబంధిత అధికారులు కూడా మధ్యాహ్నం విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. దీంతో మధ్యాహ్నం మరోసారి కరోనాపై వాదనలు కొనసాగాయి. ప్రభుత్వ వివరణలపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
10 రోజుల క్రితం తాము ఇచ్చిన ఆదేశాలు ఇప్పటికీ అమలు కాకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
జనసంచారం తగ్గించేందుకు ఎందుకు చర్యలు తీసుకోలేదని అసహనం వ్యక్తం చేసింది హైకోర్టు. పబ్బులు, మద్యం దుకాణాలే ముఖ్యమా అని సూటిగా ప్రశ్నించింది. ప్రజల ప్రాణాలు గాల్లో తేలాడుతుంటే ఇంకెప్పుడు నిర్ణయాలు తీసుకుంటారని నిలదీసింది.
డీజీపీ, ఆరోగ్య అధికారులు ఇచ్చిన నివేదికలు తప్పులతడకగా ఉన్నాయని హైకోర్టు తప్పుబట్టింది. కరోనాపై ప్రభుత్వం తీసుకున్న చర్యలపై మరోసారి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఆర్టీపీసీఆర్ టెస్టు రిపోర్టులను 24 గంటల్లో అందించాలని స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీలో నమోదైన కేసులను వార్డులవారీగా కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. కోవిడ్ వివరాలను ఎప్పటికప్పుడు వెబ్ సైట్ లో నమోదు చేయాలని సూచించింది. ఆసుపత్రులలో సలహాలు ఇవ్వడానికి నోడల్ అధికారిని నియమించారా.. అని ప్రశ్నించింది. పెళ్లిళ్లు, శుభకార్యాలు, పబ్లిక్ ప్లేస్ లలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. తెలంగాణలో స్కూల్స్ మూసేశామని, మతపరమైన ర్యాలీలపై నిషేధం విధించామని అడ్వొకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే పెళ్లిళ్లు, చావులు, పర్సనల్ పార్టీలు, ఎన్నికల ర్యాలీలపై ఎందుకు ఆంక్షలు విధించలేదని హైకోర్టు ప్రశ్నించింది.
మధ్యాహ్నం విచారణకు హాజరైన హెల్త్ సెక్రటరీ.. కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఢిల్లీలో కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించారని.. ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవాలని ప్రశ్నించింది. కనీసం వారాంతాల్లో కూడా ఆంక్షలు లేవని.. మాల్స్, సినిమా హాల్స్, పబ్బులు, క్లబ్బుల్లో జనాలు విచ్చలవిడిగా తిరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీసింది. పరిస్థితిని మానిటర్ చేస్తున్నామని ఏజీ చెప్పడంతో.. మానిటరింగ్ తోనే ఆగిపోయిందని.. చర్యలు మాత్రం శూన్యమని ఆక్షేపించింది. కుంభమేలా నుంచి తిరిగి వచ్చిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.













