కాంగ్రెస్ లో కుర్చీలాట..?
కాంగ్రెస్ పార్టీ గెలవలేదు.. ఆపార్టీ అధికారంలోకి రాలేదు.అప్పుడే సీనియర్ల నుంచి సీఎం రాగాలు మొదలైపోయాయి. నాకు ఛాన్స్ ఉంటుందేమో అని ఒకరు.. నాకు అవకాశముంటుందని మరొకరు.. ఏమో సామాజిక సమీకరణాల నేపథ్యంలో తమకేమైనా అవకాశముంటుందా అని మరికొందరు ఆశపడుతున్నారు. అయితే అది వారిలో ఉంటే పర్లేదు.. ఎన్నికలు జరగకముందే బయటపెట్టడం ఆపార్టీకి పెద్ద శాపంలా మారింది. ఎందుకంటే ప్రత్యర్థి పార్టీలైనా బీఆర్ఎస్, బీజేపీలు… కాంగ్రెస్ పార్టీని ఎండగట్టేందుకు .. ఆపార్టీకి 12 మంది సీఎంలంటూ సెటైర్లు వేస్తున్నాయి.
ముందుగా టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. తానే సీఎంనని పరోక్షంగా చెబుతున్నారు. కొడంగల్ బిడ్డకు సీఎం అవకాశముంటుందంటున్నారు. ఎన్నికల ప్రచారంలో సైతం ఇదే విషయాన్ని చెబుతున్నారు. రెడ్డి కమ్యూనిటీ కావడం కూడా ఆయనకు కలసివచ్చే అంశం. రెండోది ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని ముందుకు తీసుకెళ్లగలిగిన మాస్ లీడర్. అందుకే తనకు అవకాశం ఉంటుందని రేవంత్ బలంగా నమ్ముతున్నారు. ఇక పార్టీ సీనియర్ నేత జానారెడ్డి.. ఈయన గతంలోనే పలు శాఖలను నిర్వహించారు. ఎన్టీఆర్ హయాం నుంచే మంత్రిగా వ్యవహరించారు జానా. గతంలో సీఎం పదవి వచ్చినట్లు వచ్చి, చేజారింది. తర్వాతి పరిస్థితుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం కేసీఆర్ సీఎం కావడం జరిగిపోయాయి. మళ్లీ కాంగ్రెస్ గాలి వీస్తుందన్న అంచనాల నడుమ.. తనకు సీఎం పదవి దక్కుతుందన్న ఆశలు జానాలోనూ చిగురించాయి. దీనికి తోడు కమ్యూనిటీ లీడర్ల అండ ఉండనే ఉంది.
హైకమాండ్ దగ్గర పలుకుబడి వెరసి .. ఏమో ఛాన్స్ వస్తుందేమో అన్న ఆశలు కనిపిస్తున్నాయి. సీఎల్పీనేత .. భట్టి విక్రమార్క. చాలా సీనియర్ నేత అయిన భట్టికి.. దళితవర్గాల్లో చాలా పాపులారిటీ ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ అత్యున్నత స్థాయి పదవుల్లో దళితులను కూర్చోబెడుతోంది. దీంతో ఆ కోటాలో తమనేతకు అవకాశం వస్తుందన్న భావన భట్టివర్గంలో కనిపిస్తోంది. దీనికి తోడు ఇటీవలే భట్టి విక్రమార్క.. ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేశారు. ఆయాత్రలో అనుభవాలు, సమస్యలను.. పార్టీ మేనిఫెస్టోలోనూ పెట్టారు. దీంతో భట్టికి అవకాశం వస్తుందని ఆయన వర్గం బలంగా నమ్ముతోంది. ఇక వీళ్లందరినీ పక్కన పెడితే.. ఇటీవలే ములుగు ఎమ్మెల్యే సీతక్క సైతం ఈజాబితాలో చేరారు.
పిలిచి అకాశమిస్తామంటే.. తాను సీఎం పదవి చేపడతానన్నారు సీతక్క. దళిత సామాజిక వర్గం, మహిళా కోటాకింద తనకు అవకాశం దక్కొచ్చన్న ఆశ సీతక్కలోనూ కనిపిస్తోంది. దీంతో పార్టీ నిండా సీఎం అభ్యర్థులే కనిపిస్తున్నారు. అయితే వీరందరికీ ఇటీవలే చురకలేశారు సీనియర్ నేత విహనుమంతరావు. ముందు పార్టీ గెలవనివ్వండి.. తర్వాత సీఎం పంచాయతీ తేల్చుకుందురు.. అంటూనే అది కూడా హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు విహెచ్..













