ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
జగిత్యాల జిల్లా మల్యాల మండలం ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయంలోని మూల విరాట్‌కు ఉదయం 3 గంటలకు తిరుమంజనం అనంతరం భద్రాచలం నుంచి వచ్చిన పట్టువస్త్రాలను అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అర్థరాత్రి నుంచి సుమారు 2 లక్షల మంది దీక్షాపరులు అంజన్నను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా యాగశాలలో హోమం నిర్వహించారు. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయానికి గురువారం భక్తులు పోటెత్తారు. ఇరుముడి పూజలకు విశేష సంఖ్యలో తరలివచ్చిన అంజన్న భక్తులు, పవిత్ర గోదావరిలో పుణ్య స్నానాలను ఆచరించి దీక్షలను విరమించారు. రామనామ స్మరణతో భద్రాద్రి మార్మోగింది. ప్రధాన ఆలయంలో రాముల వారికి అర్చనలు నిర్వహించి అనుబంధంగా ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో అభిషేకాలు చేశారు.













