మంత్రి కేటీఆర్ కు మరో అరుదైన ఆహ్వానం
జర్మనీలోని హాంబర్గ్‌లో వచ్చె నెల 2న జరిగే జర్మన్ ఏసియా పసిఫిక్ బిజినెస్ అసోసియేషన్ 98వ అంతర్జాతీయ సమావేశానికి హాజరు కావాల్సిందిగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. ఆసియా దేశాలతో వ్యాపార వాణిజ్య అవకాశాలను చర్చించడం ప్రధాన ఎజెండాగా ఉన్న ఈ సమావేశానికి సుమారు 300 మంది వ్యాణిజ్యవేత్తలు, రాజకీయ ప్రతినిధులు, దౌత్య వేత్తలు హాజరవుతారని అసోసియేషన్ తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం మూడేళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ, ఆర్థిక విధానాలపైన జర్మన్ వ్యాపార వర్గాలకు ఆసక్తి ఉందని, తమ దేశంలోని అగ్రస్థాయి వ్యాపార వేత్తలతో ప్రత్యేకంగా ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ముఖ్య వక్తగా హాజరై ప్రసంగించాల్సిందిగా కేటీఆర్‌కు ఆహ్వానం పంపింది. ఈ సమావేశంలో తెలంగాణ, జర్మన్ మధ్య వాణిజ్యబంధం మరింత విస్తృత మవుతుందని అసోసియేషన్ ఆశాభావం వ్యక్తం చేసింది. తెలంగాణలోని వ్యాపార అవకాశాలపైన సంస్థ ప్రత్యేకంగా ఆసక్తి వ్యక్తం చేయడం, అలాగే తనకు ఆ ఆహ్వానం పంపడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.













