అయ్యో గరికపాటీ..! ఆ మాత్రం ఓపిక లేకపోతే ఎలాగా..? నెటిజన్స్ ఫైర్
గరికపాటి నరసింహారావు.. సుప్రసిద్ధ ప్రవచనకారుడు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది. ఆయన పేరు తెలియని తెలుగువారుండరు. ఇక నిన్నటి నుంచి గరికపాటి పేరు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. చిరంజీవిపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నిత్యం టీవీల్లోనో, రేడియోల్లోనే జీవన విధానం, విలువల గురించి గరికపాటి నరసింహారావు ప్రవచిస్తుంటారు. అలాంటాయన కాసేపు ఓర్పు, సహనం కోల్పోయారంటూ చిరంజీవి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకూ చిరంజీవి, గరికపాటి నరసింహారావు ఎపిసోడ్ లో ఏం జరిగింది..?
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రతిఏటా దసరా తర్వాత అలయ్ బలయ్ నిర్వహించడం ఆనవాయితీ. అలయ్ బలయ్ అంటే ఆలింగనం అని అర్థం. కష్టాలని మరిచిపోయి, విద్వేషాలను పక్కనపెట్టి.. మనుషులుగా మనందరం ఒక్కటే అనేది అలయ్ బలయ్ సూక్తి. అందుకే ఆయన పార్టీలకతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరికీ ఆహ్వానం పలుకుతుంటారు. ప్రముఖులు కూడా మిత్రబేధాలను పక్కనపెట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. మెగాస్టార్ చిరంజీవే ఈ విషయం స్టేజ్ పై ప్రకటించారు కూడా. గత ఏడాది పవన్ కల్యాణ్ ను అలయ్ బలయ్ కు ఆహ్వానించారు దత్తాత్రేయ. తానెందుకు దత్తాత్రేయ కంట్లో పడలేదని, తననెందుకు పిలవలేని బాధపడినట్లు చిరంజీవి స్టేజ్ మీదే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అందరూ ఎదురు చూస్తుంటారనేందుకు ఇదొక ఉదాహరణ.
ఈ ఏడాది కూడా అలయ్ బలయ్ ను ఘనంగా నిర్వహించారు బండారు దత్తాత్రేయ. చిరంజీవి, గరికపాటి నరసింహా రావు సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రముఖులందరూ స్టేజ్ పై మాట్లాడారు. చిరంజీవి మాట్లాడుతున్నప్పుడు గరికపాటి నరసింహారావు గొప్పతనాన్ని ప్రముఖంగా వర్ణించారు. తన ప్రవచనాలు వింటూ ఉంటానని.. ఆయనకు పద్మశ్రీ వచ్చినప్పుడు అభినందించానని చెప్పారు. వీలైతే త్వరలోనే తన ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తానని ప్రకటించారు. అదీ చిరంజీవికి గరికపాటిపై ఉన్న అభిమానం.. ఆప్యాయత..! చిరంజీవి ప్రసంగించడం ముగియగానే అక్కడున్న ఆయన అభిమానులంతా చిరంజీవిని చుట్టుముట్టి ఫోటోలు తీసుకోవడం మొదలుపెట్టారు.
ఇంతలో మైక్ అందుకున్న గరికపాటి నరసింహారావు తన ప్రసంగాన్ని ప్రారంభించబోయారు. ఎంతసేపటికీ చిరంజీవి దగ్గరున్న జనం పక్కకు జరగట్లేదు. దీంతో గరికపాటి నరసింహారావుకు కోపం వచ్చేసింది. చిరంజీవి గారూ.. ఫోటో సెషన్ ఆపుతారా.. లేకుంటే సెలవు ఇప్పిస్తారా… అనేశారు. దీంతో అక్కడున్నవాళ్లంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. దీంతో చిరంజీవి మరేమీ మాట్లాడకుండా వచ్చి గరికపాటి పక్కన కూర్చున్నారు. ఇదిప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
చిరంజీవి ఎక్కడున్నా అభిమానులు ఎగబడడం కామన్. పైగా ప్రసంగం ముగియగానే ఆయన స్టేజ్ దిగి వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో ఫ్యాన్స్ అంతా ఎగబడ్డారు. ఇందులో చిరంజీవి తప్పులేదు. గరికపాటి చెప్పినట్లు తను ఫోటో సెషన్ పెట్టలేదు. అయినా.. చిరంజీవి లాంటి వాళ్లు స్టేజ్ పై ఉన్నప్పుడు ఇలాంటి దృశ్యాలు చాలా కామన్. ఆ మాత్రం కూడా గరికపాటి అర్థం చేసుకోలేకపోయారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. కాసేపటికిందటే గరికపాటి గురించి చిరంజీవి ఘనంగా చెప్పిన విషయాన్ని కూడా మర్చిపోయారని.. నిత్యం ఓర్పు, సహనం గురించి వల్లెవేసే గరికపాటే.. వాటిని కోల్పోవడమేంటని ఎద్దేవా చేస్తున్నారు.













