హస్తానికి పొన్నాల బై బై..! నేడే రేపో కారెక్కేందుకు రెడీ..!!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా కారణాలను వివరిస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన సుదీర్ఘ లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ తనను వాడుకుని వదిలేసిందని ఆయన లేఖలో పేర్కొన్నారు. తన రాజకీయ ప్రస్తానంలో జరిగిన కొన్ని ముఖ్యమైన అంశాలను ఆయన లేఖలో పేర్కొన్నారు. అయితే పొన్నాలకు టికెట్ నిరాకరించడం వల్లే ఆయన పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఆయనతో బీఆర్ఎస్ నేతలు టచ్ లో ఉన్నారు. నేడోరేపో ఆయన బీఆర్ఎస్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్ భ్రష్టుపట్టిపోయిందని పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలుపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీలో సీనియర్లకు గౌరవం ఇవ్వట్లేదన్నారు. రేవంత్ రెడ్డిని కలిసేందుకు చాలాసార్లు ప్రయత్నించానని.. ఆయినా కలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నెలల తరబడి వెయిట్ చేశానన్నారు. సర్వేల పేరుతో నియోజకవర్గాల్లో పేరు కూడా తెలియని నేతలను సిఫారసు చేస్తున్నారని చెప్పారు. కుటుంబానికి ఒక టికెట్ మాత్రమే ఇస్తారని.. కానీ అలా జరగుతోందా అని ప్రశ్నించారు. ఉదయ్ పూర్ డిక్లరేషన్ ఏమైందని నిలదీశారు. చెప్పుడు మాటలు విని పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారన్నారు.
తెలంగాణ ఏర్పడిన సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల బాధ్యతలు స్వీకరించారు. అయితే పీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ పొన్నాల లక్ష్మయ్య జనగామలో ఓడిపోయారు. దీంతో ఆయన్ను రాజీనామా చేయాలని పార్టీ ఆదేశించింది. దీంతో ఆయన రాజీనామా చేశారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో టికెట్ కోసం పొన్నాల తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. 2014లో తానే బీఫారాలు అందించిన లక్ష్మయ్య.. 2018లో బీఫారం కోసం ఢిల్లీ స్థాయిలో చర్చలు జరపాల్సి వచ్చింది. చివరకు టికెట్ దక్కినా.. జనగామలో ఆయన మళ్లీ ఓడిపోయారు. ఈసారి టికెట్ కేటాయించినా పొన్నాలక్ష్మయ్య ఓడిపోతారని సర్వేల్లో తేలింది. వాస్తవానికి జనగామ టికెట్ కోసం పొన్నాల దరఖాస్తు చేసుకున్నారు. అయితే సర్వేల్లో ఆయన ఓడిపోతారని తేలింది. దీంతో అక్కడ కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని పోటీ చేయించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పొన్నాల లక్ష్మయ్య పార్టీకి రాజీనామా చేశారు.
పొన్నాల లక్ష్మయ్యను బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. గురువారం రాత్రి పొన్నాలతో దాసోజు శ్రవణ్ భేటీ అయినట్టు సమాచారం. ఈరోజు కేటీఆర్ కూడా పొన్నాలను కలిసి పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. జనగామ టికెట్ ఇచ్చే పరిస్థితి లేనందున ఆయనకు ఎమ్మెల్సీ చేస్తామని హామీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ లోకి ఓ వైపు వలసలు కొనసాగుతుండగా .. మరోవైపు రాజీనామాలు కూడా కంటిన్యూ అవుతున్నాయి.













